తెలంగాణ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున మధ్యాహ్నం అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. అయితే.. బడ్జెట్ ను మాత్రం ఫిబ్రవరి 6న ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఆ రోజున ఉదయం 10.30 గంటలకు బడ్జెట్ సమర్పించనుంది. మంత్రి హరీష్ రావు సభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు.
హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం కేసీఆర్.. మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాలపై సమాలోచనలు జరిపారు. మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, అధికారులు భేటీ అయ్యారు. సమావేశాల తేదీలపై చర్చలు జరిపారు. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ తేదీకి సంబంధించి మాట్లాడుకున్నారు.
సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశం అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగానికి గవర్నర్ ను ఆహ్వానించేందుకు రాజ్ భవన్ కి వెళ్లారు.
సాధారణంగా రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. అయితే.. గతేడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరిగాయి. ఈసారి మాత్రం గవర్నర్ ప్రసంగంతోనే జరగనున్నాయి.