తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి హరీష్ రావు రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొచ్చారు. ఇందులో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఏకంగా రూ.26,831 కోట్లను కేటాయించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. రుణమాఫీ పథకానికి రూ.6385 కోట్లు, రైతు బంధుకు రూ.15,075 కోట్లు, రైతు బీమాకు రూ.1,589 కోట్లు, ఆయిల్ పామ్ సాగుకు రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇక ఆయిల్ పామ్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఆయిల్ పామ్ సాగుద్వారా ప్రతి ఎకరానికి రూ.లక్షా 50 వేల వరకు నికర ఆదాయం వస్తుందన్నారు.
ప్రభుత్వ అసాధారణ కృషితో నేడు సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణగా అవరించిందని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు.. తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని రైతులు ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు, రైతు భీమా, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తారణాధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతు బంధు సమితులు ఏర్పాటు వంటివి ఏర్పాటు చేశారని వెల్లడించారు.
కాగా తెలంగాణ ఏర్పాటుకు ముందు పదేళ్లలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు రూ.7994 కోట్ల నిధులు ఖర్చు చేశాయని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2023 జనవరి నాటికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.1,91,612 కోట్లు వెచ్చించిందని చెప్పారు. అంటే 20 రెట్లు నిధులు అధికంగా ఖర్చు చేసిందన్నారు మంత్రి హరీష్ రావు.