తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. మొదట ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు అనుకున్నప్పటికి కాస్త అలస్యంగ మార్చిలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల అంతా మంత్రులు బిజీ బిజీగా ఉంటుండడంతో సమావేశాలను వచ్చే నెలలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి మొదటి లేదా రెండో వారంలో సమావేశాలు ప్రారంభం కావొచ్చని సమాచారం. గత బడ్జెట్ సమావేశాలు సెప్టెంబరు 9న ప్రారంభం కాగా… అదే రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ అమల్లోకి వస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు మార్చి 21లోపే ప్రారంభం కావాలి. సెప్టెంబరు 9న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు మధ్యలో సెలవులను మినహాయించి 14 నుంచి 22 వరకు కొనసాగాయి. నిబంధనల ప్రకారం సెప్టెంబరు 22 నుంచి ఆరు నెలల్లోపు మళ్లీ సమావేశాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మార్చి 21వ తేదీకి ఆరు నెలల కాలం పూర్తవుతున్నందున ఆలోపే సమావేశాలను ప్రారంభించాలి.
వాస్తవానికి ప్రభుత్వం ఫిబ్రవరిలోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ, సహకార ఎన్నికలు, తాజాగా పంచాయతీరాజ్ సమ్మేళనాలు ముందుకురావడంతో బ్రేక్ పడింది. సహకార సంఘాల ఎన్నికలు ఈ నెల 15న పూర్తి కానున్నాయి. ఆ తరువాత పంచాయతీరాజ్ సమ్మేళనలు ఉన్నందున మంత్రులు అందరూ బిజీగా ఉంటారు. అందుకే వచ్చే చివరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది