తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ
పువ్వాడ అజయ్
సబితా ఇంద్రారెడ్డి
బెర్తులు ఖరారు..?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించడానికి ముహూర్తం ఫిక్సయ్యింది. బాధ్రపద మాసం అంత మంచిది కానప్పటికీ దశమి రోజు సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని కేసీఆర్ నిర్ణయించారు. రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియామకమైన తమిళి సై సౌందర్‌రాజన్‌కు మంత్రి వర్గ విస్తరణ సమాచారాన్ని తెలియజేశారు. విస్తరణలో భాగంగా మరో ఆరుగురికి మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ బెర్త్ ఖరారైనట్టు చెబుతున్న జాబితాలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్ ఉన్నారు. ఇందులో కేటీఆర్, హరీశ్‌రావు టీఆర్‌ఎస్ తొలి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. ఇద్దరూ వెలమ సామాజిక వర్గానికి, కేసీఆర్ కుటుంబానికి చెందిన వారు. సబితా ఇంద్రారెడ్డి ఈ మధ్య టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒకరు. గంగుల కమలాకర్, అజయ్ ఎమ్మెల్యేలు. సత్యవతి ఎమ్మెల్సీ. గంగుల మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. అజయ్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. సత్యవతి ఎస్టీ-లంబాడి. ఇద్దరు మహిళలను కేబినెట్‌లోకి తీసుకుంటానని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన దరిమిలా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి ఇద్దరికీ అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కేటాయించే మంత్రిత్వ శాఖలపై కూడా అప్పుడే ఒక వార్త ప్రచారంలో వుంది. కేటీఆర్‌కు లోగడ నిర్వహించిన ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ పరిపాలన శాఖలనే కేటాయిస్తారని సమాచారం. హరీశ్‌రావుకు లోగడ నిర్వహించిన నీటిపారుదల శాఖ ఈసారి ఇవ్వడం లేదంటున్నారు. ఆయనకు ఆర్థిక శాఖను ఇస్తారని తెలుస్తోంది. మంత్రి మహమూద్ అలీ నుంచి హోంశాఖను తప్పించి సబితా ఇంద్రారెడ్డికి కేటాయిస్తారని ఒక అంచనా.
ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు దీటుగా కౌంటరిచ్చే మంత్రులు ఎవరూ లేకపోవడంతో హరీశ్, కేటీఆర్‌లను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ ఏదీ క్లారిటీ లేదు. కొత్త గవర్నర్ చేతుల మీదుగా ఈ ప్రమాణ స్వీకారం జరగనుంది.