ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. మంత్రి కొప్పుల ఈశ్వర్ మినహా మిగతావారు ఈ సమావేశానికి హాజరయ్యారు. కొప్పుల ఈశ్వర్ విదేశీ పర్యటనలో ఉన్నందున ఈ భేటీకి హాజరు కాలేకపోయారు. ఈ మంత్రి వర్గ భేటీలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించి ఆమోదించనున్నారు. ఇదే సమావేశంలో మంత్రివర్గ సిఫార్సుపై గవర్నర్ ఆమోదించే రెండు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు సమాచారం.
అందులోనూ ప్రధానంగా ఇళ్ల స్థలాలు, ఇళ్లకు సంబంధించి పంపిణీ, ఆర్థిక సహాయంపై ఈ కేబినెట్ లో చర్చ జరగనుంది. ఈ పథకాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది.
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇతర పాలనా, రాజకీయ అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల ఏడాది నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకెళ్లడం, పార్టీ కార్యాచరణ తదితర అంశాలపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది