కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్.. ధాన్యం కొనుగోళ్లపై యుద్ధం నేపథ్యంలో మంగళవారం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంత్రి వర్గం సమావేశం కానుంది.
కేబినెట్ లో భేటీలో ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ధర్నా సందర్భంగా కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ పెట్టారు కేసీఆర్. రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఎన్నికలు వస్తేనే మోడీకి రైతులు గుర్తుకొస్తారని మండిపడ్డారు.
రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని.. దానికోసం రాజకీయ పార్టీల మద్దతు కూడగడతామని స్పష్టం చేశారు కేసీఆర్. అసలు.. కేంద్రానికి ఎందుకంత అహంకారమని ప్రశ్నించిన కేసీఆర్.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని చెప్పారు.
కేంద్రాన్ని గద్దె దించే సత్తా రైతులకు ఉందని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పందించకపోతే తామే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ జరగనుండడం ప్రాధాన్యం సంతకరించుకుంది. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది.