తెలంగాణ మంత్రి వర్గ కీలక సమావేశాన్ని రేపు నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. సమావేశానికి సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు.
కవిత ఈడీ విచారణ, ఒక వేళ అరెస్టయితే ఏ విధంగా వ్యహరించాలి, వ్యూహాత్మకంగా ఎలా ముందుకు సాగాలనే విషయంపై చర్చించనున్నట్టు సమాచారం. మరోవైపు కవిత ఈ రోజు ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ఆమె ఢిల్లీ వెళ్లే ముందు ఆమెతో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది.
బీజేపీ అకృత్యాలపై న్యాయ పోరాటం చేద్దామని ఆమెకు కేసీఆర్ ధైర్యం నూరిపోసినట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆమెకు కేసీఆర్ భరోసా ఇచ్చినట్టు సమాచారం. నోటీసులపై ఎలాంటి ఆందోళనా అవసరం లేదని ఆమెతో చెప్పినట్టు తెలుస్తోంది.
అంతకు ముందు ఈ రోజు ఈడీకి కవిత లేఖ రాశారు. ముందస్తు నిర్ణయించిన కార్యక్రమాల నేపథ్యంలో తాను విచారణకు రేపు హాజరు కాలేనని లేఖలో తెలిపారు. ఈ నెల 15న హాజరవుతానని లేఖలో కోరారు. ఈ క్రమంలో దీనిపై ఈడీ స్పందించింది. 11న విచారణకు రావాలని ఈడీ స్పష్టం చేసింది.