తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ బదిలీ అయ్యారు. శశాంక్ గోయల్ ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ.. కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న శశాంక్ గోయల్.. కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.
గతంలో శశాంక్ గోయల్ కార్మిక, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సేవలు అందించారు. అంతేకాకుండా.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గానూ విధులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఎనలేని సేవలను అందించారు శశాంక్.
కాగా ..1990 బ్యాచ్ తెలంగాణ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి శశాంక్ గోయల్.. ఇక నుంచి కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహించనున్నారు. అయితే.. 13 మంది అదనపు కార్యదర్శి స్థాయి అధికారులను మంగళవారం కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ బదిలీ చేసింది.
అందులో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తో పాటు మధ్యప్రదేశ్ క్యాడర్ కు చెందిన వీఎల్ కాంతా రావు కూడా ఉన్నారు. వీఎల్ కాంతా రావు కేంద్ర టెలీ కమ్యూనికేషన్స్ శాఖలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. కానీ.. గోయల్ స్థానంలో ఎవరిని నియమిస్తారు అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు.