తెలంగాణ సీఐడీ చీఫ్ గోవింద్‌సింగ్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. రాజస్థాన్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గోవింద్ సింగ్ తృటిలో ప్రాణాలతో బయటపడగా, ఆయన భార్య అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటనలో కారు డ్రైవర్ తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గోవింద్ సింగ్ కు ఫ్రాక్చర్ అయింది. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. జైసల్మేర్ జిల్లాలోని రామ్‌గఢ్-టానోట్ రహదారిపై కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
అందిన సమాచారం ప్రకారం… మాతేశ్వరి తనోతరాయ్ మాత ఆలయాన్ని సందర్శించడానికి తెలంగాణ సీఐడీ డీజీ, ఐపీఎస్ గోవింద్ సింగ్ తన భార్యతో కలిసి వెళ్లారు. రామ్‌గఢ్ ప్రాంతంలో ఉన్న ఘంటియాలీ మాత ఆలయం సమీపంలోకి చేరుకోగానే కారు ఒక్కసారిగా బోల్తా పడింది.
దీంతో వాహనంలో ఉన్న డీజీ గోవింద్ సింగ్ భార్య షీలా సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. డీజీ గోవింద్ సింగ్‌కు స్వల్పంగా గాయాలు అయ్యాయి. దీంతో ప్రథమ చికిత్స అనంతరం ఆయన్ని అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జవహర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటన సమాచారం తెలుసుకున్న బీఎస్ఎఫ్ అధికారులు తమ అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈరోజు ఉదయం సుమారు 9.10 గంటలకు ఆయన భార్యతో కలిసి గోవింద్ సింగ్ ఆలయాన్ని సందర్శించారు. తిరుగు ప్రయాణంలో సుమారు 2.45 గంటలకు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.