తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది జూలై 22న తన స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడక పర్యటనకు వెళ్లి ఆ గ్రామంపై వరాలు కురిపించారు. గ్రామస్తులు అడగని హామీలు ఇచ్చారు. ప్రతి ఇంటికి రూ.10 లక్షల చొప్పున సాయం అందేలా పథకం ప్రారంభిస్తామన్నారు. అందు కోసం రూ.200 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. ట్రాక్టర్లు, కోళ్ల ఫారాలు, వ్యవసాయ పరికరాలు, డబుల్ బెడ్ రూమ్ లు, ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఒక్కటేమిటి ఇలా ప్రజలు అడగని పలు హామీలు ఇచ్చారు.
అయితే ఈ హామీలేవి ఎన్నికల హామీలుగా మిగిలి పోలేదు..ఆ హామీలన్నీ ఇప్పుడు అక్షరాల అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తన సొంతూరుకు చెప్పినట్టే చేసి చూపిస్తున్నారు. చింతమడకలో ప్రతి ఇంటికి ఉపాధి పథకాలు అందుతున్నాయి. కార్లు, ట్రాక్టర్లు, డీసీఎంలు ప్రజలు ఏవీ కోరుకుంటే అవి ఇంటికి ముందుకొస్తున్నాయి. సీఎం ఆదేశాల మేరకు కోళ్ల ఫామ్‌లు, డెయిరీ ఫామ్ లు,హార్వెస్టర్లు, జేసీబీలు, ఆటోలు, మొబైల్ షాపులు, కార్పెంటర్ మిషన్లు, గూడ్స్ కారియర్స్ మంజూరు చేస్తున్నారు. చింత మడకతో పాటు దాని చుట్టు పక్కల గ్రామాలైన అంకంపేట, మాచాపూర్, సీతారాంపల్లి లో ఇంటింటి సర్వే నిర్వహించి మొత్తం 1506 కుటుంబాలున్నట్టు గుర్తించారు. ఆ కుటుంబాల ఉపాధి కోసం ఏమేమి కావాలో నివేదిక తయారు చేశారు. నాలుగు విడతల్లో రూ.53.68 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధుల్లో ఇప్పటి వరకు 716 కుటుంబాలకు 607 యూనిట్లు అందజేశారు. యూనిట్ కు పది లక్షల లోపైతే ఒక కుటుంబానికి, పది లక్షలు దాటితే పార్ట్ నర్ షిప్ కింద ఇస్తున్నారు. ఇంకా 790 కుటుంబాల కోసం అవసరమైన నిధులు (దాదాపు రూ.60 కోట్లు) త్వరలో విడుదల కానున్నట్టు అధికారులు తెలిపారు.
అంతే కాదు చింతమడక తో పాటు మూడు గ్రామాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కళ్యాణ మండపాల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఎర్రవెల్లి మోడల్ లో ఈ డబుల్ బెడ్ రూమ్ లను నిర్మించడానికి ఇప్పటికే పాత ఇళ్ల కూల్చి వేత కార్యక్రమం మొదలైంది. ఇళ్లు కూల్చివేసిన వారికి శివార్లలో తాత్కాలిక ఇళ్లను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచిక తయారు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి వ్యక్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి రక్త నమూనాలు సేకరించారు. వారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైతే హైదరాబాద్ కు పంపి చికిత్స చేయిస్తున్నారు. చింతమడక సమగ్రాభివృద్ధి చాలా వేగంగా కొనసాగుతోంది. చింతమడకను రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చుదిద్దుతామన్న ముఖ్యమంత్రి హామీ మేరకు పనులు చకా చకా జరుగుతున్నాయి.
అయితే దీనిపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికా..? లేక చింతమడక గ్రామానికి మాత్రమేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు రాష్ట్రం సమసల్య వలయంగా మారి ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే తన సొంత ఊరుకు, కేవలం ఒక్క గ్రామానికే వందల కోట్లు ఖర్చు చేయడం ఏంటని అడుగుతున్నారు. 50 వేల మంది ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు రూ. 30 కోట్లు కూడా చెల్లించలేమని రాష్ట్ర హైకోర్టుకు తెలిపిన ముఖ్యమంత్రి 716 కుటుంబాలకు రూ. 55 కోట్లు ఎలా విడుదల చేశారని ప్రశ్నిస్తున్నారు.