సీఎం కేసీఆర్ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయారు. అదేంటీ… తెలంగాణ వచ్చాకే ప్రగతి భవన్ కట్టుకున్నారు కదా… మళ్లీ కొత్త ఇంటికి షిఫ్ట్ కావడమేంటీ అనుకుంటున్నారా…? అవును ప్రస్తుతానికి సీఎం హోదాలో ప్రగతి భవన్‌లోనే ఉంటున్నా, తనకు ఎంతో ఇష్టమైన ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు సీఎం కేసీఆర్.
డిసెంబర్ 15కు ముందే ఇంటి నిర్మాణం పూర్తికాకున్నా… మంచి రోజులు వెళ్లిపోతాయన్న ఉద్దేశంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెండు రోజులు సీఎం కేసీఆర్ అక్కడే ఉండి వచ్చారు. అప్పుడే పండితులు జనవరి 12 తర్వాత మీరు కొత్తింట్లోకి ఎప్పుడైనా వెళ్లవచ్చు అని చెప్పటంతో సీఎం కేసీఆర్ కొత్త ఇంట్లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. గురువారం మూడో రోజు నిద్ర తర్వాత శుక్రవారం ఉదయం సీఎం కేసీఆర్ హైదరాబాద్ చేరుకోనున్నారు.
సీఎం కేసీఆర్ ఈ ఇంటిని దగ్గరుండి నిర్మించుకుంటున్నారు. కొంతకాలంగా ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే గడుపుతూ సూచనలు, సలహాలు చేస్తూ కొత్తి ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా ప్లాన్ చేశారని సమాచారం. విశాలమైన ఇంటితో పాటు లిఫ్ట్, సమావేశ గదులు, డైనింగ్ హాలు, ముఖ్యమైన అతిథులు ఎవరైనా వస్తే బస చేసేందుకు వీలుగా గెస్ట్ హౌజ్ ఇలా సకల సదుపాయాలతో సర్వంగా సుందరంగా ఈ కొత్త ఇంటి నిర్మాణం చేసినట్లు తెలుస్తోంది.