ఆర్టీసి చలో ట్యాంక్ బండ్ విజయవంతమైంది. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా తెలంగాణ ప్రజలు మిలియన్ మార్చ్ లో పాల్గొన్నారు. ఇదిరా తెలంగాణ పౌరుషం అని మరోసారి నిరూపించారు. ఈ పోరాటంలో గాయాలపాలయ్యారు. కార్మికుల కాళ్ళు విరిగిపోయాయి. మహిళా కార్మికులను లాఠీలతో కొట్టారు.కార్మికుల పోరాటాన్ని లైట్ తీసుకున్న ప్రభుత్వ పెద్దలకు మిలియన్ మార్చ్ విజయవంతం కావడం తలదించుకునేలా చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. సమస్యను పక్కదారి పట్టించడానికి టాంక్ బండ్ పైకి మావోయిస్టులు చేరుకున్నారని మరో ఎత్తుగడ వేసింది.ఇక్కడే ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం రెండు ప్రశ్నలు అడుగుతోంది.
ఇందులో మొదటిది, అసలు మావోయిస్టుల పనైపోయింది, ఉనికిలో లేరు అంటూ పోలీసులు చాలా సందర్భాల్లో మీడియా ముందు చెప్పారు. మరి ఉనికిలో లేని మావోయిస్టులు హైదరాబాద్ నడిబొడ్డున ఎలా కనిపించారు? మావోయిస్టులు ఉన్నారనే అనుకుందాం …ఇంత పోలీస్ నిర్భంధం మధ్య మావోయిస్టులు ఎలా రాగలిగారు??
ఇక ప్రజలు అడుగుతున్న రెండో ప్రశ్న. ఉద్యమ సమయంలో, టీఆరెఎస్ అధికారం లోకి వచ్చిన తరువాత మావోయిస్ట్ అజెండా మా అజెండా అన్న కెసిఆర్ ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు? చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులు చొరబడ్డారని , హింసకు పాల్పడ్డారంటున్న ప్రభుత్వం, మావోయిస్ట్ ఎజెండా మా ఎజెండా అని ఎందుకన్నారు?
ఈ ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? అవసరం కోసం ఒకలా, అవసరం తీరాక ఇంకోలా ప్రభుత్వ తీరు ఉందని తెలంగాణ సమాజం అభిప్రాయపడుతోంది.