ఏపీలో కేసీఆర్ స్కోర్ పెరిగింది!

‘సెంట్ పర్సెంట్ పాలిటిక్స్’కి పెట్టింది పేరైన కేసీఆర్ మళ్ళీ తన మార్క్ ఏమిటో చూపించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ వ్యవహరించిన తీరు మీద ఎటుచూసినా ప్రశంసాత్మకమైన విశ్లేషణలే కనిపిస్తున్నాయి. ఈసారి రాజ్యసభకు తెలంగాణ నుంచి ముగ్గురికే ఛాన్స్ వుంది. మొదటి ఛాన్స్ కేసీఆర్ బంధువు జోగినపల్లి సంతోష్ కే దక్కుతుందని వారం రోజుల ముందే లీకులొచ్చాయి. మిగతా రెండు అవకాశాల మీదే సస్పెన్స్ నెలకొంది. బండ ప్రకాష్, బీ. లింగయ్య యాదవ్ పేర్లను ఖరారు చేస్తూ తర్వాత ఫైనల్ లిస్ట్ బైటికొచ్చేసింది. ఆదివారం జరిగిన తెరాస లెజిస్లేటివ్ మెంబర్ల సమావేశంలో ఈమేరకు తుది నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్.

తాజా ఎత్తుగడతో బలహీన వర్గాల మనసుల్ని కేసీఆర్ మరోసారి దోచుకున్నట్లయ్యింది. ముదిరాజ్, యాదవ సామాజిక వర్గాల్ని ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్నారని.. ఇప్పుడు ఇద్దరు బీసీలను పెద్దల సభకు పంపడం ద్వారా కేసీఆర్ మళ్ళీ తమకు దగ్గరయ్యారని బీసీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాష్ట్రంలో 65 శాతానికి పైగా వున్న వెనుకబడిన వర్గాలను ప్రసన్నం చేసుకోడానికి ఇటువంటి ప్రత్యేక కసరత్తు తప్పనిసరి. టీ-పాపులేషన్లో మినిమమ్ షేర్ వున్న రెడ్డి, కాపు, కమ్మ కులస్థుల్ని అనేక రకాలైన రాజకీయ ఉపాయాలతో దగ్గర చేసుకుంటున్న కేసీఆర్.. అదే సమయంలో బీసీల మీద పట్టు కోల్పోకుండా జాగ్రత్త వహిస్తున్నారు.

రెండు సీట్లు బీసీలకివ్వడం ద్వారా.. మూడో సీటు సొంత బంధువుకిచ్చుకున్నారన్న ‘రాద్ధాంతం’ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. ముఖ్యమంత్రి కుటుంబం నుంచి మరొకరికి ప్రమోషన్ దొరికిందన్న విషయాన్ని జనం చర్చించుకోకుండా కేసీఆర్ ఈవిధంగా జాగ్రత్తపడ్డారు. అదీ కేసీఆర్ మార్క్ రాజనీతి శాస్త్రం అంటూ కాంప్లిమెంట్లూ పడిపోతున్నాయి. అటు.. ఏపీలో సైతం ‘బీసీల పాలిట దేవుడు’ అంటూ కేసీఆర్ మీద పొగడ్తల వర్షం కురుస్తోంది. ఆయన ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు సైతం జరుగుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ గవర్నెన్స్ మీద పాజిటివ్ మోడ్ తో వున్న సగటు ఏపీ జనాభాకు ఇది ప్లస్ అన్నమాట !