ఫాదర్ అండ్ సన్ కలిసి హరీష్‌రావుకు చెక్ పెట్టారా? మేనల్లుణ్ణి కేసీఆర్ పూర్తిగా విశ్వాసంలోకి తీసుకోలేదా? ఇటీవలి పరిణామాలను చూస్తుంటే ఇందులో అనుమానం ఏముంది అనిపిస్తోంది. హరీష్‌రావుకి ఇచ్చిన శాఖకు అనుబంధంగా ఉండాల్సిన శాఖల్ని కట్ చేయడాన్ని బట్టి ఇది కరెక్టేనని చెప్పవచ్చు.
హరీష్‌రావుని బిగ్‌బాస్ ఇంకా విశ్వాసంలోకి తీసుకున్నట్లు కనబడటంలేదు. ఆయనకు ఇచ్చిన శాఖను చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. ప్లానింగ్ లేని ఆర్థికశాఖను ఇచ్చారు. ఆర్ధికశాఖలో ప్లానింగ్ కూడా అంతర్భాగమే. శాఖాపరంగా వేర్వేరు అయినప్పటికీ ఇప్పటివరకు ఈ రెండు శాఖల్ని ఆర్థికమంత్రి దగ్గరే వుండేవి. అలాంటిది సంప్రదాయానికి విరుద్దంగా ప్రణాళికా శాఖను వేరు చేయడం హరీష్‌రావు విషయంలోనే జరిగింది. ఇక ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ వినోద్‌ని నియమించారు. ఈ సంఘానికి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారు. ఐతే, ఆర్థికమంత్రికి ఏమాత్రం సంబంధం లేకుండా ప్లానింగ్ శాఖలో అతను తలదూర్చకుండా ఆ శాఖ నుంచి వేరు చేయడం చూస్తుంటే కేవలం ఉత్సవ విగ్రహంగా కూర్చోబెట్టడానికే పదవి ఇచ్చారా అని భావించాల్సివస్తోందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
హరీష్‌రావుకి మంత్రి పదవి ఇచ్చినట్లే వుండాలి, కానీ విస్తృత అధికారాలు ఇవ్వకూడదన్నది కేసీఆర్ వ్యూహంగా ఉంది. హరీష్‌కి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అటు పార్టీ శ్రేణులలో ఇటు ప్రజలలో కేసీఆర్‌పై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైది. దీని నుంచి బయటపడాలంటే హరీష్‌కి మినిష్టర్ పదవి ఇవ్వక తప్పని పరిస్థితి. అదే సమయంలో ఆయనకు పూర్తి బాధ్యతలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనితో ప్రజలలో హరీష్‌కు ఉన్న గ్రాఫ్‌ను వ్యూహాత్మకంగా తగ్గించగాలిగాడు. అదే సమయంలో పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిని కూడా బ్రేక్ వేయగలిగాడు. హరీష్‌పై చెక్ మాత్రం కొనసాగుతూనే ఉంది అని చెప్పవచ్చు.
ఆర్ధికమంత్రికి అనుబంధంగా వుండాల్సిన శాఖను వేరు చేయడాన్ని ఏవిధంగా అర్ధం చేసుకున్నా ఒకటే స్ట్రాటజీ కనిపిస్తోంది. ఆర్ధికశాఖ చాలా ముఖ్యమైన శాఖ అయినప్పటికీ జిల్లాలలో పర్యటించే అవకాశాలు అస్సలు లేని శాఖ. ప్రారంభోత్సవాలు, పర్యవేక్షణలు లేని శాఖ ఏదైనా వుందీ అంటే అది ఆర్థికశాఖ మాత్రమే. రాష్ట్రమంతటా తిరిగే అవకాశం లేకుండా హరీష్‌రావుని కట్టడి చేయడానికే ఈ శాఖను ఇచ్చారా అని భావించాలి. పైగా ఆర్థికశాఖను నిర్వహించే మంత్రికి పని వత్తిడి కూడా చాలా ఎక్కువగా వుంటుంది. నిత్యం ఆర్థిక కార్యకలాపాల్ని, రాష్ట్ర ఖజానా హెచ్చుతగ్గుల్ని గమనిస్తూ అప్రమత్తంగా వుండే శాఖ ఇది. ఇలాంటి శాఖలో హరీష్‌ను వుంచడం వల్ల ప్రధానంగా రెండు కార్యాలు నెరవేరుతాయి. ఒకటి హరీష్ పూర్తిగా తన శాఖ వ్యవహారాల్లో కొట్టుమిట్టాడుతూ ఇతరత్రా రాజకీయాలు చేయనీయకుండా కట్టడి చేయడం.. రెండు జిల్లాల్లోె పర్యటించే అవకాశాలు లేకుండా చేయడం ద్వారా అతనొక పవర్ సెంటర్‌గా మారకుండా చూడటం.. సింపుల్‌గా చెప్పాలంటే ఇది కట్ చేసి కట్టడి చేయడం లాంటిది.
ఎటూ హరీష్‌రావుకి పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదు ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ప్రయారిటీ లేకుండా చేశారు. మరోవైపు కేటీఆర్‌కి అటు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా వుంది. ఇటు ప్రభుత్వంలో కీలకమైన శాఖలు ఉన్నాయి. ఈ రెండింటి వల్ల అతను స్టేట్‌లో నెంబర్ వన్ పొజీషన్‌లో వుండి చక్రం తిప్పవచ్చు. దీనిపై రాజకీయ వర్గాలలో బాగా చర్చ జరుగుతోంది. ఇటు గులాబీ శ్రేణులలో రచ్చ మొదలయ్యింది. నిజానికి టీఆర్ఎస్ పార్టీ అంటే హరీష్‌రావే. అందుకే కేసీఆర్ మొదట అక్కడి నుంచి నరుక్కుని వచ్చారు. కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చి కూర్చోబెట్టి తన రాజకీయ వారసుడు కుమారుడేనని చాటారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తే బడుగు వర్గాల ప్రతినిధిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ తరువాత తను అధికార పీఠంపై కూర్చుని ఇచ్చిన మాటను తుంగలో తొక్కారు. తన తరువాత అయినా పార్టీలో ఒక సీనియర్త లీడర్‌ని తీసుకొచ్చి అధికార పీఠంపై కూర్చోబెట్టాలన్న ఆలోచన అస్సలు చేయడం లేదు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని అన్నీ తానై నడిపించిన ఈటల రాజేందర్ లాంటి వారిని ఇప్పుడు ఈటెల్లాంటి మాటలతో గుచ్చిగుచ్చి వదిలిపెడుతున్నారు. పార్టీని తన కంటే బాగా సమర్ధంగానడిపించిన హరీష్‌ని పూర్తిగా పక్కకు పెట్టేశారు.
ఇలా ఉంటే ఇప్పటికే సిద్దిపేటకు చెందిన మారెడ్డి శ్రీనివాసరెడ్డికి సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మెన్‌గా నియమించారు. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి తెలుగుదేశం శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీచేసినప్పుడు టీడీపీ నుంచి తనపై పోటీ చేసిన వ్యక్తే ఈ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఆ తరువాత ఆయన టీఆర్ఎస్‌లో చేరాడు. కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎక్కువ కాలం పనిచేశారు. మొదటి నుంచి శ్రీనివాస్ రెడ్డి.. హరీష్‌కు వ్యతిరేకంగా ఉంటూ వచ్చాడు. హరీష్‌కి వ్యతిరేకంగా కేటీఆర్‌ని రాజకీయాలలోకి తెచ్చిన కొద్దిమందిలో శ్రీనివాస్ రెడ్డి ఒకరు. హరీష్‌కి రెండోసారి మంత్రి పదవి ఇచ్చేదాని కన్నా ముందే శ్రీనివాస్ రెడ్డికి ఛైర్మెన్ పోస్ట్ ఇచ్చారు. దీనిపై పార్టీలో పెద్ద చర్చ జరిగింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదటి నామినేటెడ్ పోస్ట్ ఇదే. మళ్ళీ ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి ఛైర్మెన్ పోస్టుల నియామకం ఏమీ జరగలేదు. అంటే శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్ధం అవుతుంది.
ఇప్పుడు హరీష్‌కి మంత్రి పదవి ఇచ్చిన తరువాత వైశ్య కులానికి చెందిన సిద్దిపేటకు చెందిన మోరంశెట్టి రాములుని టీటీడీ బోర్డు సభ్యుడిగా పోస్టు ఇప్పించారు. ఒక సాధారణ వ్యక్తిని, పార్టీలో కూడా తగిన ప్రాధాన్యత లేని అతనికి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించడంలో కేసీఆర్ వ్వుహం ఏమై ఉంటుందో కేసీఆర్ పట్ల రాజకీయ అవగాహన ఉన్నవారికి ఎవరికైనా అర్ధమవుతుంది. హరీష్‌కి అడుగడుగునా చెక్ పెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నాడు. హరీష్‌కి మంత్రి పదవి ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి. అలాగని స్వేచ్చ కూడా ఇవ్వలేని పరిస్థితి. అతన్ని కిమ్మనకుండా కూర్చోబెట్టి వారసుణ్ని పైకి తీసుకురావాలన్నదే ఆలోచన. కేటీఆర్‌కి మంత్రిపదవి ఇవ్వాలంటే హరీష్‌కి కూడా ఇవ్వాల్సిన అనివార్యమైన రాజకీయాలు వున్నాయి. లేదంటే ఇంటా బయటా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. దీని నుంచి బయటపడే మార్గాన్ని ఎంచుకుని ఆలోచించే కేసీఆర్ చివరకు హరీష్‌కి మంత్రి పదవి ఇస్తూనే ఆయనకు చెక్ పెట్టాలని వ్వుహ రచన చేశాడు. అందులో భాగమే శ్రీనివాస్ రెడ్డికి, మోరంశెట్టి రాములుకి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. అంతేకాదు కేవలం ఆర్ధికశాఖ మాత్రమే ఇచ్చి హరీష్‌ని కట్టడి చేశాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.