ఏపీలో అత్యధిక పంట దిగుబడి సాధించిన ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేయడం చర్చనీయాంశమైంది. సీడ్రిల్‌ను ఉపయోగించి ఎకరానికి 40-45 బస్తాలు పండించడంపై ఆ రైతును కేసీఆర్ అభినందించడం ఆశ్చర్యపరుస్తోంది. కేసీఆర్ చేసిన పని ఎంతో మెచ్చుకోదగినదే అయినా.. తెలంగాణ రైతుల విషయంలో కూడా అదే చొరవ ఎందుకు చూపించడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అధిక ధర కల్పిస్తామన్న కేసీఆర్ మాటలు నమ్మి.. తెలంగాణలో అత్యధిక మంది రైతులు సన్నవడ్లను పండించారు. ఈ క్రమంలో వారు గతంలో కంటే అధిక వ్యయం చేయాల్సి వచ్చింది. అయితే దొడ్డు రకం కంటే సన్న వడ్ల దిగుబడి తక్కువ వచ్చింది. పోనీ ధర ఎక్కువ వస్తుందిలే అని ఆశపడితే.. చివరికి కేసీఆర్ సర్కార్ వారిని నిండా ముంచింది. కేంద్రాన్ని సాకుగా చూపి ఎక్కువ ధర ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో లక్షలాది మంది సన్న వడ్లు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి సమయంలో తెలంగాణలో ఏ ఒక్క రైతుకు ఫోన్ చేసి ధైర్యం చెప్పని కేసీఆర్.. ఏపీ రైతుకు మాత్రం ఫోన్ చేసి పలకరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.