– దేశమంతా దళితబంధుకు డిమాండ్
– రాబోయేది విపక్షాల ప్రభుత్వమేనని స్పష్టం
– అప్పుడు ఉచిత కరెంట్ అందిస్తాం.. అగ్నిపథ్ రద్దు చేస్తాం
– ఎవరినీ అడుక్కోవాల్సిన అసవరం లేదు
– దేశంలో లక్షల కోట్ల ఆస్తి ఉంది..
– అవసరమైన సహజ సంపద ఉంది..
– బీజేపీ తెలివిలేని పోకడ వల్లే వెనుకబాటు
– దారి తప్పిన దేశాన్ని గాడిన పెట్టాలి
– తెలంగాణ మోడల్ దేశమంతా అమలు చేస్తాం..
– మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియాగా మారింది
– కేసీఆర్ వెంటే ఉంటామన్న కేజ్రీవాల్, పినరయి, అఖిలేష్
బీఆర్ఎస్ ఆవిర్భావ సభ వేదికగా బీజేపీని గద్దె దించుతామని శపథం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆయనతోపాటు సభకు హాజరైన నేతలంతా బీజేపీ పాలన పోవాలని నినదించారు. చివరిలో మాట్లాడిన కేసీఆర్.. ఖమ్మం సభ దేశంలో రాబోయే మార్పునకు సంకేతమని స్పష్టం చేశారు. దేశం దారితప్పిందని చెప్పారు. ఏ ప్రపంచ బ్యాంకును అప్పు అడగకుండా.. ఏ అమెరికా కాళ్లను మొక్కకుండా బతికే వనరులు మనకున్నాయని తెలిపారు. సంపద ఉండి కూడా మనం ఎందుకు భిచ్చమెత్తుకుంటున్నామని అన్నారు. దేశంలో అద్భుతమైన పంటలు పండే అవకాశం ఉన్నా.. ఇంకా ఆహార ఉత్పత్తుల్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో రాబోయేది విపక్షాల ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు కేసీఆర్. అప్పుడు దేశ వ్యాప్తంగా ఉచిత కరెంట్ అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రగతి సూచికలో విద్యుత్ రంగం అత్యంత కీలకమైందని.. అది కచ్చితంగా పబ్లిక్ సెక్టార్ లోనే ఉంచాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలసీ అదేనని స్పష్టం చేశారు. కరెంటు కార్మికులారా? పిడికిలి బిగించండి.. విద్యుత్ ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుదామని పిలుపునిచ్చారు. అంతేకాకుండా దళితబంధును దేశ వ్యాప్తంగా అమలు చేయాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని.. దేశంలో లక్షల కోట్ల కోట్ల ఆస్తి ఉందని, ఇదంతా ఏమైతుందని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ తెలివిలేని పోకడల వల్ల దేశం మరింత వెనుకబాటుకు గురవుతోందని విమర్శించారు.
తెలంగాణ మోడల్ దేశమంతా అమలు చేస్తామన్నారు కేసీఆర్. నష్టాలు సమాజానికి.. లాభాలు ప్రైవేట్ వ్యక్తులకా? అని ప్రశ్నించారు. ఎల్‌ఐసీని అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌ఐసీ కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని.. ఏజెంట్లు, ఉద్యోగులు తమ పార్టీని బలపరచాలన్నారు. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమని తెలిపారు. మోడీ అమ్మితే తాము అధికారంలోకి వచ్చాక కొంటామని హామీ ఇచ్చారు. లొడలొడ మాట్లాడే ప్రధానికి మంచి నీళ్లు ఇవ్వడం చేతకాదా? అని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా.. జోక్ ఇన్ ఇండియాగా మారిందని ఎద్దేవ చేశారు. అధికారంలోకి వస్తే అగ్నిపథ్ ను రద్దు చేస్తామని ప్రకటించారు.
కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ విధానాలు ప్రజల ముందుంచుతామని తెలిపారు కేసీఆర్. 150 మంది మేధావులు బీఆర్ఎస్ విధానాలు రూపొందిస్తున్నారని అన్నారు. దేశంలో చైతన్యం తెచ్చేందుకు బీఆర్ఎస్ పుట్టిందని.. దేశ ప్రజలను కష్టాల నుండి విముక్తి చేస్తామని చెప్పారు. దేశంలో బీఆర్ఎస్ లాంటి పార్టీ అధికారంలో ఉంటే రెండేళ్లలో వెలుగు జిలుగులు జిమ్మే భారత్ తయ్యారు అయ్యేదని చెప్పారు.
ఇక ఖమ్మం జిల్లాపై వరాల జల్లు కురిపించారు కేసీఆర్. ఖమ్మం చరిత్రలో ఇంత పెద్ద సభ ఎప్పుడూ జరగలేదన్న ఆయన.. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని 589 గ్రామ పంచాయితీలకు ముఖ్యమంత్రి నిధి నుంచి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ.30కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సత్తుపల్లి, మధిర, వైరాలను సైతం ఖమ్మం మున్సిపాలిటీ తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే జిల్లాలోని జర్నలిస్టులకు నెల రోజుల్లో ఇళ్ల స్థలం కేటాయించాలని మంత్రి హరీష్ రావు, పువ్వాడ అజయ్ కు సూచించారు కేసీఆర్.