నర్సింహా రెడ్డి, జర్నలిస్ట్
నోటితో నవ్వి – నొసటితో వెక్కిరిస్తున్నాయి ప్రభుత్వాలు. గంటలకొద్దీ సుద్దులు చెప్తూ వాటివెనక విషాన్ని చిమ్ముతున్నారు ప్రభుత్వ పెద్దలు. ఇదేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇక డిక్షనరిలో వెతికినా కూడా దొరకని తిట్లు తిడుతారు, బూతులు మాట్లాడినా కూడా అవి వేదమంత్రాలు అని భజన చేసే బృందాలు ఉండనే ఉన్నాయి. వెరసి సామాన్యుడి జీవితం పెనం నించి పొయ్యిలో పడింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పోటీ పడి మరీ సామాన్యుడి జీవితం తో అదేదో ఆట ఆడుతున్నాయి.
ప్రతి రాష్ట్రం మేము దేశానికే ఆదర్శం అని గొప్పలు చెప్పుకుంటున్నాయి, అవును నిజమే, తెలంగాణ ముఖ్యమంత్రి చాలా సార్లు ఈ మాట చెప్పారు. అప్పుడు నిజమా కాదా అనే అనుమానం ఉండేది, కానీ ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. దేశం అంత రెడ్ జోన్ మినహా మిగతా ప్రాంతాల్లో లిక్కర్ షాప్స్ ఓపెన్ చేస్తే కేసీఆర్ మాత్రం రెడ్ జోన్ లో కూడా లిక్కర్ ఓపెన్ చేసి దేశానికి ఆదర్శం అయ్యారు. గంటల కొద్దీ మీడియా ను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్, లిక్కర్ షాప్స్ ఓపెన్ చేస్తాం అని చెప్పక ముందు చాలా నీతులు చెప్పారు. మనం హైదరాబాద్ ను కాపాడుకోవాలి, లాక్ డౌన్ పటిష్టంగా పాటించం కాబట్టే కరోనాను ఎదురుకున్నాం, ఇంకా కొన్ని రోజులు ప్రజలు ఈ కష్టాలు భరించాలి, రాత్రి 7 గంటల నుంచి మాత్రం కర్ఫ్యూ ఉంటుంది, కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు మేము మాత్రం సంక్షేమం విషయంలో వెనక్కి తగలేదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. దాంతో పాటు అసలు లిక్కర్ ఎందుకు ఓపెన్ చేయాలి అనుకుంటున్నారో కూడా ముఖ్యమంత్రి వివరించారు, ఒక రకంగా మాకు ఇష్టం లేదు గాని పక్క రాష్ట్రాలు ఓపెన్ చేసాయి మాకు తప్పడం లేదు అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి.
ఒక పక్క హైదరాబాద్ లోనే కేసులు వస్తున్నాయి అని చెప్తున్నారు అధికారులు. ముఖ్యమంత్రి కూడా మనం హైదరాబాద్ ను కాపాడుకోవాలి అని అన్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. కంటైన్మెంట్ ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి అని, వైన్ షాప్స్ ఎందుకు ఓపెన్ చేసినట్లు, హైదరాబాద్ లో కాలనీలు, బస్తీలు ఎలా ఉంటాయో తెలియనిది కాదు, మేము కంటైన్మెంట్ జోన్ లో తెరవడం లేదు గా అంటున్నారు, కంటైన్మెంట్ జోన్ చుట్టూ ఏమైనా చైనా వాల్ నిర్మించిందా ఈ ప్రభుత్వం. కంటైన్మెంట్ ప్రాంతానికి ఆను కొని ఉన్న ప్రాంతం లో మందు దొరుకుతున్నప్పుడు కంటైన్మెంట్ ప్రాంతంలో తాగే వాళ్ళు సైలెంట్ గా ఇంట్లో కూర్చుంటారా? పక్క రాష్ట్రం ఓపెన్ చేసింది ప్రజలు అక్కడి నుంచి అక్కడికి మద్యం కోసం రాకపోకలు సాగిస్తున్నారు అన్నారు,మరి కంటైన్మెంట్ ప్రాంతాల్లో కూడా ఇది జరిగే అవకాశం ఉందిగా. ఒక వైన్ షాప్, ఒక మర్కజ్ తో సమానం అని నిపుణులు అంటుంటే ఇవేవీ ప్రభుత్వాలకు పట్టడం లేదు. రెడ్ జోన్ లో మిగతా షాప్స్ అన్ని మూసేస్తూ వైన్ షాప్స్ ఒక్కటే ఎందుకు తెరుస్తున్నారు, పని చేసుకొని బ్రతుకుతాం అంటే తెరవద్దు, కరోనా విజృంభిస్తుంది అంటున్నారు. మరి కరోనా వైరస్ ఎక్కడైన ప్రకటించిందా నేను లిక్కర్ షాప్స్ కు మాత్రం మినహాయింపు ఇచ్చాను అని. కేంద్రం చెప్పిన విదంగా సడలింపులు ఇస్తున్నాం అని కేంద్రం పై నెపం నెట్టే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి, అదే మీడియా సమావేశం లో కేంద్ర నిర్ణయాలు దిక్కుమాలినవి అన్నారు,మీరు అన్నది వంద శాతం నిజం, వైన్ షాప్స్ తెరవాలి అనే కేంద్ర నిర్ణయం కూడా దిక్కుమాలిన నిర్ణయమే మరి ఎందుకు పాటిస్తున్నారు.
సంక్షేమంలో మేమే టాప్. అవును కేంద్రం మీరు కలిపి 12 కిలోల బియ్యం ఇచ్చారు, మీరు ఇస్తాం అన్న 15 వందలు ఇంకా చాలా మందికి రాలేదు. కుడి చేతితో ఇచ్చి ఎడం చేతితో లాక్కుంటున్నారు ఇది ఎంతవరకు సమంజసమొ మీరే ఆలోచించాలి. గత రెండు నెలలుగా పని లేక ఆదాయం లేక ప్రజలు విలవిలలాడుతింటే, వైన్ షాప్స్ ఓపెన్ చేయడం తో పాటు, రేట్లు పెంచి వాళ్ళను మరిన్ని కష్టాల్లోకి నెట్టడం కాదా? మధ్యతరగతి కుటుంబాల్లో గొడవలకు ఇది ఆస్కారం ఇవ్వడం లేదా..? మీరు ఇచ్చిన 15 వందలు మళ్ళీ మీరే తిరిగి తీసుకుంటున్నారు కదా. వైన్ షాప్స్ టెండర్లలో తీసుకున్నవాళ్ళు షాప్స్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి లేదా డబ్బులు రిటర్న్ ఇవ్వండి అని అడుగుతున్నారు అని ముఖ్యమంత్రి అంటున్నారు, వాళ్లకు సర్దిచెప్పే అవకాశం లేదా, వాళ్ళు నష్టపోయిన ఈ రెండు నెలల సమయాన్ని వాళ్ళ టెండర్ ముగిసే సమయంలో పొడిగిస్తే సరిపోతుంది గా. ప్రజలకు ఆదాయ మార్గం మాత్రం చూపరు మీ ఆదాయం మాత్రం చూసుకుంటున్నారు. రైతుల ధాన్యం కొంటున్నాం ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు అన్నారు, ప్రతిపక్షాల ఆరోపణలు పక్కన పెడితే వరి ధాన్యం ఎన్నిరకాలో మీకు తెలియనిది కాదు. అందులో ఏ రకాన్ని కొంటున్నారు, ఏ రకాన్ని వదిలెస్తున్నారో రైతుల దగ్గరకు వెళితే అర్థం అవుతుంది. కొన్న ధాన్యానికి మే నెల అంతటా డబ్బులు వస్తాయి ఇలా వేయగానే అలా డబ్బులు వస్తాయా అని ప్రశ్నిస్తున్నారు, పండించిన పంటకు డబ్బులు ఇవ్వరు, వేరే పనులు చేసుకుందాం అంటే లాక్ డౌన్ కారణంగా చేతిలో చిల్లి గవ్వ లేదు, కానీ కళ్ళ ముందు మందు. ఇంకేముంది ఇంట్లో పెళ్ళనివో తల్లివో నగలో, వస్తువులో ఉంటాయి కదా తెగనమ్మి తాగండి.ఇదే కదా మీరు చెప్పేది. అవును లే మేము తెరుస్తాం డబ్బులు ఉన్నవాడు తాగుతాడు వీళ్ళను ఎవడు తాగమంటుండు, మేము పోలీస్ లను పెట్టి తీసుకొచ్చి తాగిస్తున్నామా ఈ దిక్కుమాలినోళ్లు ఇలాగే విమర్శిస్తారు అని సీఎం సర్ అంటారు దానికి కొందరు భజన చేస్తారు.
మీకు ఆదాయమే ముఖ్యం కాబట్టి ఆన్ లైన్ అమ్మకాలకు, హోమ్ డెలివరీలకు అనుమతి ఇవ్వండి. అప్పుడు ఎలాంటి గోల ఉండదు.
మద్యపానం హానికరం, కుటుంబాలు నాశనమౌతాయి, ఇలాంటి సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం అడడమే, కుటుంబాల్లో చిచ్చు పెట్టడమే ఇది ప్రభుత్వాలకు శోభనిస్తుందా ? కరోనా నియంత్రణకు గుడిని బడిని మూసిన ప్రభుత్వాలు మందు దుకాణాలు తెరవడం ఎంతమేరకు సమంజసమొ ఆలోచించాలి.