మరి కొద్దిరోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్రలోని 5 నియోజక వర్గాల రైతులు మంగళవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము టీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తామంటూ మహారాష్ట్ర నుంచి వచ్చిన రైతుల బృందం సీఎం కేసీఆర్‌తో చెప్పినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ ద్వారా మహారాష్ట్రకు చెందిన రైతులను అసెంబ్లీకీ పిలిపించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేవలం వీరినే కలవడానికే ఈరోజు ముఖ్యమంత్రి అసెంబ్లీకీ వచ్చారని తెలుస్తోంది. వీరిని ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి పిలిపించి భేటీ కావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమై ఉంటుదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. పైగా తాము టీఆర్ఎస్ అభ్యర్థులుగా మహారాష్ట్రలో పోటీచేస్తామని రైతులు చెప్పగా… దానికి సీఎం కేసీఆర్ అంగీకరించినట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఉంది. ఈ వ్యూహం వెనుక బీజేపీనీ బెదిరించే ఉద్దేశమా….లేకా ఇటీవల కొద్దిరోజులుగా రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న హడావుడికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగమా అన్నది తేలాల్సి ఉంది.
అయితే ఈ పరిణామాణంపై బీజేపీ జాతీయ నాయకత్వం ఏవిధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ పేరుతో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో… ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం అవ్వడం తెలిసిందే. అంతేకాకుండా కేంద్రంలో హంగ్ ఏర్పడుతుందని టీఆర్ఎస్ కీలక భూమిక పోషిస్తుందని భావించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల సమయంలో ఆర్థిక వనరులను సమకూర్చిపెట్టారన్న చర్చ కూడా ఉంది. ఫలితాలు కేసీఆర్ ఊహించినదానికి భిన్నంగా.. బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది. ఈ ఫలితాలు టీఆర్ఎస్‌కు నిరాశను మిగిల్చాయి. దీనికి తోడు 7 లోక్ సభ స్థానాలను టీఆర్ఎస్ కోల్పోయింది. నాలుగు స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ రాష్ట్రంలో తన దూకుడును పెంచింది. ఇందుకు జాతీయ నాయకత్వం కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తోంది. జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. లోక్ సభ ఎన్నికల సమయంలో కేసీఆర్ కొన్ని ప్రాంతీయ పార్టీలకు ఆర్థిక వనరలు సమకూర్చడం…ఫెడరల్ ప్రంట్‌తో ప్రాంతీయ పార్టీలను సమీకరించే ప్రయత్నం చేయడం బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. కేసీఆర్ వైఖరిపై ఆగ్రహంగా ఉన్న అమిత్ షా రాష్ట్రంలో బీజేపీనీ బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకొనే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో విలీనం చేసుకొని.. ఆ పార్టీనీ కేసీఆర్ బలహీనపరిచడం తమకు కలిసి వచ్చిన అంశంగా బీజేపీ భావిస్తోంది. ఇదే అదనుగా కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ పావులు కదుపుతుంది. ఇప్పటికే లోక్‌సభలో టికెట్ దక్కని జితేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సోమారం సత్యనారాయణ, కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీలు రాపోలు ఆనంద్ భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్‌లోని అసమ్మతి నేతలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇఫ్పటికే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను బీజేపీలో చేర్చుకున్నారు. టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని సీఎం కేసీఆర్ సంకేతాలు ఇవ్వడం దేనికి నిదర్శనం. రాష్ట్రంలోని బీజేపీ దూకుడికి కళ్లెం వేయడానికా…లేకా కేంద్ర బీజేపీ నాయకత్వానికి బెదిరించి లొంగదీసుకునే ఆలోచన ఏమైనా ఉందా అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతుంది. ఇదిలా ఉంటే చారిత్రాత్మకమైన సెప్టెంబర్ 17వ తేదీన మహారాష్ట్ర నాందేడ్ జిల్లా రైతులను పిలిపించుకోవడం వెనుక ఉన్న కేసీఆర్ లక్ష్యం ఏమై ఉంటుందన్న చర్చ కూడా రాజకీయవర్గాల్లో లేకపోలేదు. అప్పటి నిజాం సంస్థానంలో తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని కొంత భాగం.. కర్ణాటకలోని కొంత భాగం ఉంది. పాత నిజాం సంస్థానం అంతటా టీఆర్ఎస్ పార్టీనీ విస్తరింపజేయాలన్న వ్యూహం కేసీఆర్‌కు ఏమైనా ఉండి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐతే కేసీఆర్ ఇటువంటి జిమ్మిక్కులు ఉద్యమ సమయంలో కూడా చాలా చేశారని విశ్లేషకులు అంటున్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రాలో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని హడావుడి చేశారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేస్తున్నట్లు లీకులు ఇచ్చారు. అభ్యర్థిని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నామినేషన్ వేయడానికి ఏ రూట్లో వెళితే బాగుంటుందో కూడా ఆరాదీశారు. తీరా నామినేషన్ సమయం వచ్చేసరికి చడిచప్పుడు చేయలేదు.ఇలా ఉద్యమ సమయం నుంచి అనేక లీకులు ఇచ్చి హడావుడి చేసి చివరి క్షణంలో సైలెంట్ అయిన సందర్భాలు అనేకం. నాటి నుంచి లీకులు, భేటీల ద్వారా తాము అనుకున్న లక్ష్యం నెరవేరితే చాలు అన్నదే కేసీఆర్ వ్యూహంగా కనపడుతుంది. ఇప్పడు కూడా అదే అయి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. మహారాష్ట్రలో, కర్ణాటకలో టీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం కానీ, ఒక వేళ పోటీ చేసినా గెలిచే అవకాశం కానీ లేదని అంటున్నారు. పాత నిజాం సంస్థానం ప్రాంతంలో టీఆర్ఎస్ విస్తరించడం కూడా సాధ్యం కాదంటున్నారు. మరి ఇప్పుడు ఉన్నట్లుండి ఈ హడావుడి ఎందుకు చేస్తున్నారో… ఏం ఆశించి చేస్తున్నారో మరి కొద్ది రోజులు అయితే క్లారిటీ వస్తుందంటున్నారు.