లాక్ డౌన్ విధించిన 40 రోజులు దాటుతోంది. తెలంగాణకు కీలకమైన హైదరాబాద్, చుట్టు పక్కల ప్రదేశాల నుండి వలస కూలీలు వెళ్లిపోతున్నారు. ఓ పక్క కేంద్రం మే 17వరకు లాక్ డౌన్ పొడిగించినా, కంటోన్మెంట్ జోన్లు మినహా అన్నీ జోన్లలో చాలా వరకు సడలింపులు ఇచ్చింది. కానీ తెలంగాణలో మాత్రం సడలింపులు ఏమీ లేకుండానే లాక్ డౌన్ కొనసాగుతుంది.
అయితే, తెలంగాణలో మే 7వరకు ఉన్న లాక్ డౌన్ పై 5వ తేదీన రివ్యూ మీటింగ్ ఉంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ ఎత్తివేస్తారన్న ప్రచారం ఉన్న సమయంలో మే 17వరకు కేంద్రం లాక్ డౌన్ పొడిగించటంతో తెలంగాణ కూడా పొడిగించటం కూడా అనివార్యం అయ్యింది. అయితే… కేంద్రం ఇచ్చిన సడలింపులు రాష్ట్రంలో అమలు చేయాలా వద్దా అన్న అంశంపై కేసీఆర్ దృష్టి సారించారు.
భవన నిర్మాణ కార్మికులు వెళ్లిపోతే అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉందని కంటోన్మెంట్ జోన్లు మినహా అన్నీ జోన్లలోనూ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టేందుకు సర్కార్ అనుమతించింది. ఇక మద్యం షాపులు, గ్రీన్ జోన్స్ లో కేంద్రం ఇచ్చిన మినహాయింపులు అమలు చేస్తే ఎలా ఉంటుంది…. హైదరాబాద్ చుట్టుపక్కల రెడ్ జోన్స్ ఉన్న నేపథ్యంలో అక్కడ కేంద్ర సడలింపులు ఇస్తే ఎలా ఉంటుంది, కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందా.. అన్న అంశాలపై కేసీఆర్ సీనీయర్ నేతలు, మంత్రులు, నిఘా వర్గాలతో సమాచారం తెప్పించుకుంటున్నారు.
గ్రీన్ జోన్స్, ఆరెంజ్ జోన్లలో కొన్ని మినహయింపులపై సీఎం సానుకూలంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతున్నా, మద్యం షాపులపై కేసీఆర్ పోలీస్ నివేదిక కోరినట్లు తెలుస్తోంది.