కరోనా విజృంభన తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ నిర్ణయాలకు సహకరించాలని..షూట్ ఎట్ సైట్ వంటి దారుణ పరిస్థితులను కొనితెచుకోవద్దని హెచ్చరించారు సీఎం కేసీఆర్. కరోనా కట్టడికి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోన్న ప్రజల నుంచి ఆశించిన స్పందన రావడంలేదని ఆయన మాటల్లో కొటొచ్చినట్లు కనిపించింది. మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ… ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలంటూ పదేపదే విజ్ఞప్తి చేయడం సమస్య తీవ్రతను కళ్ళకు కట్టింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరు బయటకు రావొద్దని…అనవసరంగా బయటకు వచ్చి వ్యాధి తీవ్రతను మరింత పెంచవద్దని కేసీఆర్ కోరారు. కరోనా కట్టడి విషయంలో భారత్ ఇంకా భేష్ అని..అమెరికా వంటి అగ్రదేశాల్లో పరిస్థితి చేయి దాటిపోయిందని…అక్కడ ఆర్మీ ని రంగంలోకి దించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. కనుక ఇక్కడ కూడా అలాంటి పరిస్థితిని తెచుకోవద్దని ఆయన ప్రజలను కోరారు.
కరోనా నివారణ విషయంలో అవహగన కల్పించకుండా ఇంటికే పరిమితం అయిన ప్రజాప్రతినిధులకు కేసీఆర్ తన వ్యాఖ్యలతో వాతలు పెట్టారు.ఖచ్చితంగా బుధవారం నుంచి పోలీసులతో సమన్వయం చేసుకుంటూ రోడ్డు ఎక్కాల్సిందేనని ఆదేశించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనల్ని ఎన్నుకొన్న ప్రజల ఆరోగ్య భద్రతల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని చెప్పారు. వార్డు మెంబర్ నుంచి సీఎం స్థాయి వరకు అంతా రేపటి నుంచి కరోనా నివారణ విషయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
ఇక, సందు దొరికింది కదా అని బ్లాక్ మార్కెట్ దందా స్టార్ట్ చేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని ఈమేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.నిత్యావసర సరుకులు, కూరగాయలు నిర్ణయించిన రేట్లకే అమ్మాలని లేదంటే జైలుకు వెళ్లడం తప్పనిసరి అని హెచ్చరించారు. ఈమేరకు ప్రజాప్రతినిధులు కూడా కూరగాయల ధరలను పర్యవేక్షించాలని తెలిపారు. పరిస్థితి చేయి దాటకముందే జాగ్రత్త పడదమంటూ సూచించారు.
సాయంత్రం 6 తరువాత షాపులు ఎట్టి పరిస్థితుల్లో తెరవొద్దని… అలా చేస్తే వారి లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. రైతులు సాగు చేసిన పంటను గ్రామాల్లోనే కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు. ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను తుచ పాటించాలని.. ప్రభుత్వ సూచనలు పాటించకపోతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ వస్తాయని… అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని… ఆర్మీని రంగంలోకి దించాల్సిన పరిస్థితిని తెచుకోవద్దని కేసీఆర్ కోరారు.