తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఝార్ఖండ్ లో పర్యటించనున్నారు. రెండేళ్ల క్రితం చైనా సరిహద్దు వద్ద గాల్వన్ లోయలో చెలరేగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా.. మరికొందరు భారత సైనికులు అమరులయ్యారు. అయితే.. అప్పట్లో సీఎం కేసీఆర్ సంతోష్ బాబుతో పాటు మిగతా భారతీయ సైనికుల కుటుంబాలకు సైతం ఆర్థిక సహాయం ప్రకటించారు. అందులో భాగంగా నేడు ఝార్ఖండ్ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం.
నాలుగు రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం.. అక్కడి నుండి నేరుగా రాంచీ వెళ్లి.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో భేటీ కానున్నారు. తర్వాత సీఎం అధికారిక నివాసంలో రూ.10 లక్షల చెక్కులను ఝార్ఖండ్ కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు అందజేయనున్నారు. కాగా.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ధర్నాల్లో పాల్గొని మృత్యువాత పడ్డ రైతుల కుటుంబాలకు ప్రకటించిన పరిహారాన్ని కూడా అందించనున్నట్టు తెలుస్తోంది.
2020లో మే నెలలో చైనా సైన్యానికి భారత సైనికులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో మరణించిన వారిలో బిహార్ కు చెందిన వారు ఐదుగురు, పంజాబ్ నుంచి నలుగురు, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు చొప్పున.. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు జవాన్లు అమరులయ్యారు.
ఆ హింసాత్మక ఘటనల్లో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందినపుడు వారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలను అందించింది. అదే విధంగా వారితో పాటు అమరులైన 19 మంది అమర జవాన్ల కుటుంబాలను కూడా ఆర్థిక సాయాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సీఎం కేసీఆర్ ఝార్ఖండ్ పర్యటన పెట్టుకున్నారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి.. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగతా అమర జవాన్ల కుటుంబాలకూ సహాయం అందేలా చర్చలు చేపట్టినట్టుగా సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అయితే.. దేశ రాజకీయాల్లో చక్రం తప్పేందుకే కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు.