అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా ఆడబిడ్డలకు గుడ్ న్యూస్ అందించారు కేసీఆర్. స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) రూ.750 కోట్ల వడ్డీ లేని రుణం నిధులను సోమవారం విడుదల చేశారు. ఇందులో గ్రామీణ ప్రాంత ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.500 కోట్లు, పట్టణ ప్రాంత ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.250 కోట్లు కేటాయించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా మహిళలు కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారన్నారు.
సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమవుతుందన్నారు. స్త్రీ శక్తిని చాటే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మహిళా సాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు.. వారి గౌరవాన్ని పెంచేందుకు.. స్త్రీజనోద్ధరణే లక్ష్యంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు కేసీఆర్.
ఆడబిడ్డ కడుపుతో ఉన్న దశ నుంచి ఆ బిడ్డ జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, సాధికారతే లక్ష్యంగా గొప్ప పథకాలను అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపడుకుంటోందన్నారు. కేసీఆర్ కిట్ పథకం ద్వారా ఇప్పటివరకు రూ13,90,639 మంది లబ్ధిదారులకు రూ.1261 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం వివరించారు. ఆసరా పథకం కింద రూ.1,430 కోట్లు, వితంతువులకు రూ.19 వేల కోట్లు, మహిళా బీడీ కార్మికులకు రూ.5,393 కోట్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా రూ.11,775 కోట్లు, బతుకమ్మ చీరల పంపిణీ కోసం రూ.1,536 కోట్లు అందించామని చెప్పారు.
అలాగే అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు భారీగా పెంచామన్నారు. వీహబ్ ద్వారా చేపట్టిన 21 కార్యక్రమాల ద్వారా 2194 మంది మహిళల నేతృత్వంలోని అంకురాలతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పినట్టు పేర్కొన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక ఎస్టేట్ లో 10 శాతం ప్లాట్లు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. స్థానిక సంస్థల్లో 50 శాతం, మార్కెట్ల కమిటీల్లో 33 శాతం, సివిల్ పోలీస్ ఉద్యోగ నియామకాల్లో 2015 నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ఏఆర్ పోలీసు నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు వివరించారు ముఖ్యమంత్రి కేసీఆర్.