సీఎంవోలో కీలకమైన అధికారిగా… ప్రభుత్వ రహస్యాలను కూడా తెలిసిన వ్యక్తిగా… కేసీఆర్ కు నమ్మకస్తుడిగా ఉన్న అధికారి పీఆర్వో విజయ్ కుమార్. తనపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేస్తూ పేపర్లో బ్యానర్ వార్త వచ్చిన రోజు కూడా తనపై వేటు పడలేదు. కానీ ఆకస్మాత్తుగా విజయ్ కుమార్ పై కేసీఆర్ వేటు వేశారు.
తనే వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు విజయ్ కుమార్ ట్విట్టర్ లో పేర్కొన్నప్పటికీ… తనను పీఆర్వో ఉద్యోగం నుండే కాదు ట్రాన్స్ కో లో తనకు ఇచ్చిన జనరల్ మేనేజర్ ఉద్యోగం నుండి కూడా తీసేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై సీఎంవో వర్గాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.
విజయ్ కుమార్ కాళేశ్వరం ఇసుక రీచ్ లలో జోక్యం చేసుకున్నారని, ఇటీవల సంచలనం సృష్టించిన హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న వందల కోట్ల ఓ భూ వ్యవహరంలో విజయ్ ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తన సామాజికవర్గంకు చెందిన కొంతమందితో కలిసి హైటెక్ సిటీలోని బొటానికల్ గార్డెన్ పరిసర ప్రాంతంలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యవహరంలో కూడా జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా విజయ్ లెక్క చేసేవారు కాదని… చాలా మంది నేతలు విజయ్ పై సీఎం, కేటీఆర్ కు ఫిర్యాదులు అందగా, అదునుచూసి ఇప్పుడు వేటు వేసినట్లు సీఎంవో వర్గాలు పేర్కొంటున్నాయి.