తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్, తెలంగాణ ఇచ్చారన్న సానుభూతి ఉన్నప్పటికీ ఎన్నికల్లో తేలిపోతుందన్న వాదన ఉంది. 2018అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్ సభ ఎన్నికలు, హుజుర్ నగర్ బై ఎలక్షన్… ఇలా ఎన్నిక ఎదైనా కాంగ్రెస్ మాత్రం ఓడటం ఖాయం అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
త్వరలో జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ వంటి కీలక నగరాల మున్సిపల్ ఎన్నికలున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక ఉంది. ఇలాంటి సమయంలో తెలంగాణలో దూకుడుగా వెళ్లేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు కనపడుతుంది. పేరుగా పదవిలో ఉన్న కుంతియాను ఇంచార్జీగా తప్పించి, దూకుడైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా తమిళనాడులో పేరున్న నాయకుడు మాణిక్కం ఠాగూర్ ను ఇంచార్జీగా నియమించారు. ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్ సభలోనూ దూకుడుగా ఉండటంతో పాటు రాహుల్ గాంధీ కోటరీలో కీలక వ్యక్తిగా తెలుస్తోంది.
తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకత్వాన్ని మార్చి… మళ్లీ అసంతృప్తులతో ఇబ్బందిపడకుండా, నడిపించే వారిని మార్చితే కొంతైనా ఫలితం ఉంటుందని, పైగా రాష్ట్ర రాజకీయాలకు పూర్తిగా కొత్త వ్యక్తిని నియమించటం ద్వారా ఎవరు పని చేస్తారు, ఎవరు పార్టీకి పనికొస్తారన్న అంశంలోనూ క్లారిటీ వస్తుందని రాహుల్ కోటరీ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఇంచార్జీ నియామకం అనంతరం… పూర్తిస్థాయి అధ్యక్షుడిగా రాహుల్ వచ్చాకే తెలంగాణకు కొత్త అధ్యక్షున్ని నియమించే అవకాశం ఉంది. ఆ నియామకంలో ఎంపీ మాణిక్కం ఠాగూర్ కీలకం కాబోతున్నట్లు చెప్పకనే చెప్పారు.