జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకోవడంపై టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్‌లో ఓటు హక్కు ఉన్న కవిత.. గ్రేటర్ ఎన్నికల్లో బంజారాహిల్స్ లో ఓటు వేయడమేంటని ఆమె మండిపడ్డారు. కవిత ఓటు హక్కు వినియోగించుకోవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ, పోతంగల్‌లో ఓటరు జాబితాలో పేరు అలాగే ఉండగా.. హైదరాబాద్‌లో రెండో ఓటు ఎలా వేశారని ఇందిరాశోభన్ ప్రశ్నించారు.
కవితకు చిత్తశుద్ధి ఉంటే నిజామాబాద్ జిల్లాలోని ఓటును తొలగించిన తర్వాత.. ఇక్కడ ఓటు వేస్తే బాగుండేదన్నారు. సాక్షాత్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెన ఇలా రెండు చోట్ల ఓటు వేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగ పరుస్తూ.. దొంగ ఓటు వేసిన కవితకు ఎమ్మెల్సీగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. కవిత తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్న ఇందిరాశోభన్.. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. తక్షణమే కవిత ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని డిమాండ్ చేశామన్నారు
కాగా మంత్రి కేటీఆర్ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో ఓటు వేసి.. ఇప్పుడు హైదరాబాద్‌లో ఓటు ఎలా వేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.