తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌ను ఒంటరి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? రేవంత్ టార్గెట్‌గా నేతల మాటల తూటాలు చెబుతున్న సత్యం ఇదేనంటున్నారు అతని వర్గీయులు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఆధిపత్యాన్ని సహించని సీనియర్లు ఢిల్లీ వెళ్లి అక్కడ కేవీపీ సహాయ సహకారాలతో అధిష్టానానికి అవీఇవీ చెప్పి రావాల్సిన పీసీసీ పదవిని రానివ్వకుండా పుల్లలు పెట్టడమే కాకుండా, ఇప్పుడు అతన్ని ఒక్కణ్ణి చేసే కుట్ర చేస్తున్నారని అంటున్నారు.
రేవంత్‌రెడ్డిని జిల్లాకే పరిమితం చేయాలని భావిస్తున్నారు పీసీసీ రేసులో ఉన్న నాయకులు. తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ ఒంటరిని చేసేందుకు పన్నాగం పన్నారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తే పార్టీలో ఆధిపత్య పోరు స్పష్టంగా కనబడుతోంది. హుజూర్ నగర్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో నేతల మధ్య పోరు ముదిరింది. హుజూర్ నగర్‌లో ఉత్తమ్ పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేశారు రేవంత్. ఎవరితో సంప్రదించకుండా స్వతంత్రించి ఉత్తమ్ అభ్యర్థిని ప్రకటించడం పట్ల డి కుంతియాకు ఫిర్యాదు చేశారు. ఉత్తమ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇది తెలంగాణ కాంగ్రెస్ వర్గాలలో హాట్ టాపిక్ అయ్యింది. తర్వాత రేవంత్‌కు వ్యతిరేకంగా చాలామంది నేతలు పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు. ఇప్పటికే రేవంత్‌పై ఏఐసీసీకి పీసీసీ నేతలు కొందరు ఫిర్యాదు చేశారని సమాచారం. అతనికి పీసీసీ దక్కకుండా చేసేందుకు అన్ని రకాల ఫిర్యాదులు చేస్తున్నారట పార్టీ నేతలు. కొన్ని రోజుల క్రితం సోనియాగాంధీని రేవంత్ కుటుంబ సభ్యులతో కలిసి చాలా సేపు మాట్లాడారు. దాంతో రేవంత్‌కు పీసీసీ ఫైనల్ అయ్యిందని టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. మరుసటి రోజే ప్రకటన వస్తుంది అని అందరూ అనుకున్నారు, కానీ ఢీల్లీలో ఆ తరువాత జరిగిన పరిణామాలతో అది కాస్తా కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రేవంత్ సోనియాను కలిసిన వెంటనే అలర్ట్ అయిన సీనియర్లు భట్టి నేతృత్వంలో సంతకాలు పెట్టి మరి రేవంత్‌కు పీసీసీ ఇవ్వొద్దు అని ఫిర్యాదు చేశారు.
తనపై సీనియర్స్ ఫిర్యాదు చేయడంతో రేవంత్ కూడా ఎదురు దాడి మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న సీనియర్లు రేవంత్‌ను ఒంటరిని చేయడానికి వ్యూహాత్మకంగా ఒక్కటైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మాకు పీసీసీ ఇవ్వండని పట్టుబట్టిన నేతలు ఇప్పుడు మలో ఎవరికైనా ఇవ్వండి రేవంత్‌కు తప్ప.. అన్న కొత్త డిమాండ్ అధిష్టానం ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది.
సీనియర్లు ఇలా ఉంటే పార్టీలోని యువ రక్తం మాత్రం రేవంత్ కావాలి అంటున్నారు. రాష్ట్ర స్థాయి బేరర్లు, అన్ని జిల్లాల ముఖ్యమైన నేతలు కూడా రేవంత్‌కె మద్దతుగా ఉన్నారు అని పార్టీ జనరల్ సెక్రెటరీ మానవతా రాయి అంటున్నారు.
ఒక పక్క బీజేపీ పుంజుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతుందనేది కార్యకర్తల ఆవేదన. రేవంత్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతకు పీసీసీ ఇస్తే పార్టీ క్యాడర్‌లో నూతనోత్సాహం వచ్చే ఆవకాశం ఉంది అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు.