కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి గాను హైదరాబాద్ వచ్చిన పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ని తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ కలుసుకోలేదు. ఈ ఎన్నికలో థరూర్ తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని వీరు కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే మీడియాతో మాట్లాడిన థరూర్.. తెలంగాణ కాంగ్రెస్ కు నా బెస్ట్ విషెస్ అని చెప్పారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆయన ఫోన్ చేయగా, తమ బంధువు చనిపోయారని, కలవలేనని చెప్పారట.. అయితే మరోసారి కలుద్దామని థరూర్ పేర్కొన్నట్టు తెలిసింది. ఇక .. తనకు, పోటీలో ఉన్న మరో సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేకి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ఖర్గే తనకు మంచి మిత్రుడని ఆయన తెలిపారు. గతంలో ఖర్గేతో కలిసి పని చేశానన్నారు. తాను ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని, పార్టీ బలోపేతం కోసమే ఈ ఎన్నికలని ఆయన చెప్పారు.
జీ-23 అన్నది లేనేలేదన్నారు. ఖర్గే కూడా నిన్న ఇదే మాట చెప్పారు. లోగడ జీ-23 పేరిట లేఖ రాసిన కాంగ్రెస్ నేతలంతా ఇప్పడు బీజేపీని, ఆర్ఎస్ఎస్ ని ఎదుర్కొవాలన్నదే తమ లక్ష్యమంటున్నారని ఆయన అన్నారు. వారంతా తనకు మద్దతునిస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఏమైనా.. థరూర్, ఖర్గే మధ్య పరోక్షంగా మాటల యుద్ధం ప్రారంభమైంది. తమ దృక్పథాలపై పబ్లిక్ డిబేట్ జరగాలని థరూర్ సూచించగా.. అలాంటిదేమీ అవసరం లేదని, ఒకరికొకరు ఢీ కొనే బదులు ప్రస్తుతం బీజేపీ-ఆర్ఎస్ఎస్ పై పోరాడే సమయం ఇదేనని ఖర్గే వ్యాఖ్యానించారు.