రికార్డ్ స్థాయిలో జరిగిన మెంబర్ షిప్స్.. సీనియర్ల పంచాయితీ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ సంసిద్ధత ఇలా అనేక అంశాలతో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. మొత్తం 18 మంది నాయకులు భేటీలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి, పొన్నాల, మధుయాష్కీ సహా పలువురు నేతలు సమావేశం అయ్యారు.
పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ వివరాలు రాహుల్ గాంధీకి అందించారు నేతలు. ఈ సందర్భంగా అంతర్గత విభేదాలపై రాహుల్ ఆరా తీసినట్లు సమాచారం. ఎలాంటి గొడవలు లేకుండా ముందుకు సాగాలని.. పరస్పర సహకారం ఉండాలని దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటు పార్టీ ప్రక్షాళన అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 4న మరోసారి రాష్ట్ర నేతలతో రాహుల్ భేటీ కానున్నారు. ఏప్రిల్ 1 నుంచి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలకు ప్లాన్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని రాష్ట్రానికి రావాలని కోరారు.
ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేయనుంది కాంగ్రెస్. వాటిలో పాల్గొనేందుకు రాహుల్ ను రావాలని అడగ్గా ఆయన సానుకూలంగానే స్పందించారని చెబుతున్నారు.