తెలంగాణ కాంగ్రెస్ కొత్త బాస్ ఎంపికపై మంతనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు గాంధీభవన్ లో పార్టీ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ మంతనాలు కొనసాగిస్తుండగా, సీఎల్పీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కావటం చర్చనీయాంశం అవుతోంది.
మూడు, నాలుగు రోజులుగా కాంగ్రెస్ కొత్త బాస్ ఎంపికపై విస్తృత స్థాయిలో అభిప్రాయసేకరణ కొనసాగుతుంది. పీసీసీ రేసులో ఉన్న ఎమ్మెల్యేలు భట్టి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి తమకే ఎందుకు పీసీసీ ఇవ్వాలి, ఇస్తే పార్టీని ఎలా గాడినపెట్టేందుకు ప్రయత్నిస్తారన్న అంశంపై తమ వివరణను ఇచ్చారు. ఇటు ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి కూడా పీసీసీ ఇవ్వాలని కోరారు.
కానీ అనూహ్యంగా సీఎల్పీలో భట్టి అధ్యక్షతన ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, పోడెం వీరయ్య, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి సమావేశం కావటం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి వర్గంగా ముద్రపడ్డ ఎమ్మెల్యే సీతక్క దూరంగా ఉండటంతో… సీఎల్పీ తరుపున ఫలానా వారికే పీసీసీ ఇవ్వాలని తీర్మానం చేసే అవకాశం ఉందని ప్రచారం జరగుతోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నారన్న వాతావరణం నేపథ్యంలోనే ఈ భేటీ ఏర్పాటు చేసి ఉండొచ్చని, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్పా సీఎల్పీ భేటీయే నిర్వహించని వీరు ఇప్పుడు ప్రత్యేకంగా భేటీ కావటం వెనుక ఆంతర్యం ఇదేనని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.