బీజేపీ, బీఆర్ఎస్ లు దేశాన్ని మతం, కులం పేరుతో చీల్చి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం, ఈ ప్రజల కోసం వారి ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. నిజామాబాద్ అంటే నిజాం సాగర్, నిజాం షుగర్ ఫ్యాక్టరీలు గుర్తుకు వస్తాయని రేవంత్ అన్నారు.
మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు కృషి చేశారని వివరించారు. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, షకీల్ తదితరులు దొంగల్లా దోచుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసినా.. వారిని ఓడించారని అన్నారు. సుదర్శన్ రెడ్డి మెడికల్ కాలేజి తెచ్చారని, షబ్బీర్ అలీ ముస్లింల కోసం 4 శాతం రిజర్వేషన్లు తెచ్చారని అన్నారు. 9 ఏళ్లు అయినా కేసీఆర్ ఇస్తామన్న ముస్లిం రిజర్వేషన్లు ఏమయ్యాయని రేవంత్ ప్రశ్నించారు.
ఇక్కడి ఎమ్మెల్యే దొంగ, పాస్ పోర్ట్ ల దొంగ, ఇసుక దొంగ, బియ్యం దొంగ అని తీవ్రంగా దుయ్యబట్టారు. కాంగ్రెస్ మంచి చేస్తుందని.. అందుకే వర్షం పడిందని అన్నారు. వరుణుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేస్తే లక్ష 70 వేల ఎకరాల భూమికి నీరు వస్తుందని రేవంత్ తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్ లు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం బిచ్చం ఎత్తుకొని బతికే వాళ్ళంటూ సెటైర్లు వేశారు. ఆ సన్నాసికి చెవుతున్నా కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసిందో చూపిస్తాం రా.. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో స్వాతంత్రం వచ్చిన మొదట్లో 1480 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంటే నేడు 2 లక్షల 50 వేల మెగావాట్ల విద్యుత్ వచ్చిందని.. దేశంలో 7 లక్షల గ్రామాలకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బాక్రా నంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు కట్టిందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.