తెలంగాణ కాంగ్రెస్.. ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది. నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత హస్తం గూటికి చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఇతర పార్టీ నేతలకు ఎట్టకేలకు గేట్లు ఎత్తేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 17 నుంచి వారిని పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. ఈ మేరకు తొలి దశలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
భూపాలపల్లి నియోజక వర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత గండ్ర సత్యనారాయణ , మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత ఎర్ర శేఖర్, అదే జిల్లాకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు వారం, పది రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టుగా తెలుస్తోంది. వీరితో పాటు గత ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులగా పోటీ చేసిన వారు, అలాగే గతంలో టీడీపీ తరపున గెలిచిన మాజీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ సిద్దమవుతోంది.
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పడంతో.. ఆయన దూకుడు చూసి టీఆర్ఎస్, బీజేపీకి చెందిన చాలా మందినేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలో ఒకప్పుడు కీలకంగా పని చేసి, ఇప్పుడు ప్రాధాన్యత కోల్పోయిన వారంతా రేవంత్ రెడ్డితో చేయి కలిపేందుకు మొగ్గుచూపిస్తున్నారు. టీఆర్ఎస్‌లో తమ రాజకీయ భవిష్యత్తు లేదని తెలియడంతో.. ముందు జాగ్రత్తగా కాంగ్రెస్‌లో సీటు కన్ఫామ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలకు చెందిన దాదాపు 40 మంది కీలక నేతలు తొలిదశలో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయని అంచనా.