వెయ్యి కోట్లు కర్సువెట్టయినా సరే తెలంగాణకు రానే రానియ్యం… అవసరమైతే మా ఎమ్మెల్యేలు మాస్కులు లేకుండానే పనిజేస్తరు.. అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో గట్టిగా వార్నింగ్ ఇచ్చినా సరే కరోనా వైరస్ మాత్రం బెదిరిపోలేదు. 22 డిగ్రీల టెంపరేచర్ దాటితే ఫైరయిపోద్దట.. అని కేసీఆర్ బల్లగుద్ది చెప్పినా చూస్తుండగానే 33 జిల్లాలనూ చుట్టేసింది. సీఎం ప్రిస్క్రిప్షన్ పారాసిటమల్ పనిచేయకపోగా ఆరు నెలల్లో అధికారికంగా 800 మందికిపైగా ప్రాణాలు పొగొట్టుకున్నారు.
తెలంగాణలో కరోనా వైరస్ తొలి కేసు నమోదై నేటికి ఆరు నెలలవుతోంది. మార్చి 2 వతేదిన రాష్ట్రంలో తొలి కేసు నమోదవగా.. నెల రోజులు తిరిగే సరికి కరోనా సెంచరీ కొట్టింది. ఇక ఏప్రిల్ నాటికి థౌజెండ్ వాలా పేలినట్టు… వెయ్యి సమీపానికి (943) చేరింది. అక్కడ మొదలు తెలంగాణలో కరోనా కళ్లెం లేకుండా పరుగులు పెడుతూనే ఉంది. టెస్టుల పెరిగేకొద్ది.. కేసులు కూడా రేసు పెట్టినట్టు దూసుకెళ్లాయి. కరోనాను లేకుండా చేస్తామన్న డెడ్‌లైన్‌లు.. డెత్ కౌంట్లుగా మారాయి.
జులై నెలాఖరు వరకు( 5 నెలలు) తెలంగాణలో మొత్తం 64 వేల 911 కరోనా కేసులు నిర్ధారణకాగా.. ఒక్క ఆగస్టులోనే ఏకంగా 62 వేల 911 కేసులు నమోదయ్యేంతగా కరోనా తెలంగాణలో విస్తరించింది. జులై వరకు 506 మంది కరోనాకు బలికాగా.. ఒక్క ఆగస్టు నెలలోనే నెలలో 306 మంది ఈ మహమ్మారితో ప్రాణాలొదిలారు. మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో లక్షా 30 కేసులు బయటపడ్డాయి.
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో తెలంగాణ మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొంది. తొలుత టెస్టుల నిర్వహణలో ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవిరికిపడితే వారికి టెస్టులు చేయలేమని స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటన చేయడం విస్మయపరిచింది. ఆ తర్వాత అన్ని మరణాలను కరోనా లెక్కల్లో చూపలేమనడం లాంటి వివాదాస్పద నిర్ణయాలు.. కరోనా నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఉదాహరణంగా నిలిచాయని ఇప్పటికీ విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి.