కరోనా మహమ్మారి తెలంగాణను కమ్మేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులు గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. సీఎస్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షకు హాజరు కానున్నారు.
రాష్ట్రంలో కొత్తగా 1,11,178 పరీక్షలు నిర్వహించగా 3,557 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. తాజాగా 1,773మంది వైరస్ నుంచి కోలుకోగా ముగ్గురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 4,065కు చేరింది.
కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా ఉన్నాయి. అక్కడ 1,474 కొత్త కేసులు వెలుగుచూశాయి. మేడ్చల్ మల్కాజ్ గిరిలో 321, రంగారెడ్డిలో 275, హన్మకొండలో 130, సంగారెడ్డిలో 123, ఖమ్మంలో 104మంది కరోనా బారినపడ్డారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 24,253 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 0.57 శాతంగా, రికవరీ రేటు 96.06శాతంగా ఉంది. ఇప్పటివరకు 5.12 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది.