తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా కట్టడి తప్పుతోంది. వారం రోజులుగా వరుసగా రోజుకో కొత్త రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రోజువారీ కేసులు 500 దాటాయి. గడిచిన 24 గంటలలో 57,548 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 518 మందికి పాజిటివ్ తేలింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 157 కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 3,05,309కు చేరింది.కరోనా కారణంగా నిన్న మరో ముగ్గురు మరణించారు. వీరితో కలిపి రాష్ట్రంలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య మొత్తం 1683కు పెరిగింది. కరోనా బారి నుంచి తాజాగా 204 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,995 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఈ ఏడాదిలో అత్యధిక స్థాయిలో నమోదైన కేసులు ఇవే. చివరిసారిగా గతేడాది నవంబరులో 502 కేసులు వెలుగుచూశాయి. కాగా కేసులు తీవ్రత గతంలో కంటే ఈ ఏడాదే అధికంగా కనిపించడం కలవరపెడుతోంది.