తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2707 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 7,02,413కి చేరింది. ఈ మహమ్మారి ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మృతుల సంఖ్య 4,049కి చేరింది. కొత్తగా ఈ వైరస్ నుంచి 582 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 6,78,290 మంది రికవరీ అయ్యారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 20,462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ రోజు 1,328 కేసులు ఒక్క హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. దీంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు అవుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం అయింది.
టీనేజర్లకు మొదటి డోసుతో పాటు.. ఫ్రంట్ లైన్ వారియర్స్, వృద్దులకు బూస్టర్ డోసులు అందిస్తున్నారు. ప్రభుత్వం మాస్కులు, సామాజిక దూరం తప్పని సరిచేసింది. కరోనా నిబంధనలు పెంచడం వలన రికవరీ గణనీయంగా కనిపిస్తోందని.. జాగ్రత్తగా ఉంటే కొత్త కేసులు తగ్గడంతో పాటు రికవరీ రేటు కూడా ఆశించదగ్గ స్థాయిలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు.