తెలంగాణలో కరోనా వైరస్ మరణ మృందంగం మోగిస్తోంది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 9 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య వెయ్యి దాటేసింది. ఇప్పటివరకు తెలంగాణలో 1005 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా రాకముందు వీరంతా ఆరోగ్యవంతులే కావడం కలవరం రేపుతోంది.
కరోనా సోకి చనిపోయినవారు అంతకుముందు ఆరోగ్యవంతులై ఉంటేనే.. వారిని మరణాల లెక్కలో చేరుస్తామని గతంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఈ లెక్కన ఈ వేయ్యి మంది పూర్తి ఆరోగ్యవంతులేనని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. అయితే కరోనా మరణాలపై ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందన్న విమర్శలున్నాయి. ఇప్పటికే ఈ విషయమై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఇక నిన్నటి కేసుల విషయానికి వస్తే కొత్తగా 2,159 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 65 వేలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 33 వేల మంది కరోనా నుంచి కోలుకోగా.. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారితో కలిపి 30వే443 యాక్టివ్ కేసులు ఉన్నాయి.