– ధనిక రాష్ట్రమని గప్పాలు
– ఇతర రాష్ట్రాలకే ఆదర్శమని కబుర్లు
– అన్నింటా మనకే టాప్ అని వార్తలు
– తీరా చూస్తే.. 13 దాటినా జీతాలు లేవు
– అప్పు చేస్తేనే బండి ముందుకు..
– సారు వారి ఏలుబడి.. మాటల గారడీ!
ధనిక రాష్ట్రం.. ఒక్కో ఎకరం కోట్లు.. అందులో నెంబర్ వన్.. ఇందులో ఆదర్శం.. ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి. కానీ.. ఆచరణలో కూడా ఉంటే బాగుంటుందనేది రాజకీయ పండితుల మాట. తెలంగాణ ఏర్పడే నాటికి మిగులు రాష్ట్రం కాస్తా.. ఇప్పుడు అప్పుల కుప్పగా మారింది. అప్పు పుడితేనే సర్కార్ బండి ముందుకు కదిలే పరిస్థితి. అయితే.. తాజాగా అప్పుల విషయంలో కేంద్రం కఠిన వైఖరితో కేసీఆర్ కు పెద్ద తలనొప్పి స్టార్ట్ అయింది. రిజర్వు బ్యాంకు ద్వారా అందే అప్పు వచ్చే వారమైనా వస్తుందని ఆశలు పెట్టుకున్న తెలంగాణకు మొండి చేయి ఎదురైంది. ఈ నెల 17న స్టేట్ డెవలప్ మెంట్ లోన్స్ వేలం ప్రక్రియలో రూ.2వేల కోట్ల మేర అప్పు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇటీవల కేంద్ర ఆర్థిక కార్యదర్శితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత సానుకూల స్పందన వస్తుందని ఆశించింది. కానీ.. ఆశలన్నీ అడియాసలయ్యాయి.
మూడు రాష్ట్రాలకు మాత్రమే రూ.8,500 కోట్ల మేర రుణాలు ఇవ్వడానికి రిజర్వు బ్యాంకు మొగ్గుచూపింది. అందులో తెలంగాణ పేరు లేదు. ఇప్పటికే ఏప్రిల్ నెలలో రెండు దఫాల్లో రూ.3వేల కోట్లు, ఈనెల 2న రూ.3వేల కోట్లు అప్పు తీసుకోలేకపోయిన తెలంగాణ.. కనీసం మే 17న రూ.2వేల కోట్లు తీసుకునే అవకాశం లభిస్తుందని ఆశలు పెట్టుకుంది. కానీ… రిజర్వుబ్యాంకు చేతెలెత్తేయడంతో తెలంగాణ సర్కార్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే.. 31న జరిగే ప్రక్రియలోనైనా అప్పు తీసుకునే అవకాశం ఇస్తారేమోనని తెగ ప్రయత్నాల్లో ఉంది.
జూన్ రెండో వారంలో రైతుబంధు కోసం రూ.7,600 కోట్లు అవసరమవుతుందని అంచనా. అయితే.. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమేనని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే రైతు బంధు ఆలస్యం అవుతోంది. 2018లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మే నెలలోనే చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత నుంచి లేట్ అవుతూ వస్తోంది. ఈసారి కూడా మే నెలలో ఇవ్వడం కష్టమేనని చెబుతున్నారు. వచ్చే నెలలోనే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆర్థిక కష్టాలతో ఈసారి రైతు బంధు డబ్బులు విడతలవారీగా అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక జీతాల సంగతి సరేసరి. ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరికి ఉద్యమ సమయంలోనూ 1వ తారీఖునే జీతాలు పడేవి. కానీ.. కేసీఆర్ ఏలుబడిలో జీతాలు ఎప్పుడు పడతాయా? అని ప్రతీ ఉద్యోగి ఎదురుచూసే దుస్థితి ఏర్పడిందని అంటున్నారు విశ్లేషకులు. ఎఫ్ఆర్ బీఎం నిబంధనల కింద అందినకాడికి అప్పులు చేసుకోవడం కష్టం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ లకు గ్యారెంటీగా ఉండి అప్పులు పుట్టించి వాడుకోవడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే కొత్త అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఆదాయంలో అధిక శాతం చేసిన అప్పుల వడ్డీలకే సరిపోతోంది. ఈ ఏడాది రూ.2.56 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం. కానీ.. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే జీతాలు ఇచ్చేందుకు కిందామీదా పడుతోంది. ఇది రానున్న రోజుల్లో మరింత తీవ్రతరం కావొచ్చని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. శ్రీలంకను ఉదాహరణగా చూపిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే.. ఓ అడుగు ముందుకేసి రాజపక్సలాగే కేసీఆర్ కూడా పదవి నుంచి దిగిపోతే బెటర్ అని సూచించారు. అయితే.. ఈ పరిస్థితుల్లో కూడా మంత్రి కేటీఆర్ పాల్గొన్న ప్రతీ ప్రోగ్రాంలో తెలంగాణ సూపర్, బంపర్ అంటూ డబ్బా కొట్టుకోవడంపై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక.. గప్పాలు పోవడంపై అభ్యంతరం చెబుతున్నాయి.