కరోనా నియంత్రణకు పారామిలిటరీ బలగాలు తెలంగాణకు వస్తున్నాయనే వార్తలను తెలంగాణ డీజీపీ ఖండించారు. కేంద్ర బలగాలు రాష్ట్రానికి వస్తున్నాయని జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. శనివారం నుంచి తెలంగాణలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు పారామిలటరీ బలగాలు వచ్చాయనే వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. తెలంగాణలో పరిస్థితి అంత కంట్రోల్ లో ఉందని.. తెలంగాణకు అంత అవసరం లేదని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది.
మరోవైపు తెలంగాణలో లాక్ డౌన్ అమలు కొనసాగుతోంది. కరోనా రాష్ట్రంలో ఇంకా కంట్రోల్ లోకి రాకపోవడంతో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ గడువును కేంద్రం ప్రకటించినట్టుగా ఏప్రిల్ 14వరకు పొడిగించారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కరోనా ప్రభావం ఉంటుందని భావించి ఈ రెండు జిల్లాలో హైఅలర్ట్ కొనసాగుతోంది. చందానగర్, కోకాపేట్, కొత్తపేట్, గచ్చిబౌలి, తుర్కయాంజల్ ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఇదివరకు ప్రెస్ మీట్ లో రాష్ట్రానికి అవసరమైతే కేంద్ర బలగాలను రప్పిస్తామని చెప్పడంతో.. ఆరోజు నుంచి సోషల్ మీడియాలో తెలంగాణకు పారామిలటరీ బలగాలు రానున్నాయని..శనివారంతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతాయని ప్రచారం జరుగుతోంది. దీనిపై డీజీపీ కార్యాలయాన్ని సంప్రదించగా…ఈ వార్తలను వారు కొట్టిపారేశారు. ఇలాంటి సమయంలో ప్రజలను ఆందోళనకు గురి చేసేలా వార్తలను ప్రచారం చేయవద్దని తెలిపారు. ప్రజలు కుడా వదంతులను నమ్మవద్దని కోరారు.