తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు విచిత్రమైన హోమం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిమ్నా తండాలో టీఆర్ఎస్ ఎంపీపీ విజయలక్ష్మి నిర్వహించిన ఈ హోమంలో డీహెచ్ పాల్గొన్నారు. రాత్రి సమయంలో నిర్వహించిన ఈ ప్రత్యేక మిరప హోమంపై విమర్శలు వస్తున్నాయి. ఇవి క్షుద్ర పూజలంటూ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
తలకు పాగా ధరించి హోమం ముందు కూర్చున్నారు డీహెచ్. విజయలక్ష్మి.. ఏవే మంత్రాలు చదువుతూ మంటల్లో మిర్చి వేస్తూ కనిపించారు. హోమం చుట్టూ తిరుగుతూ పూజలు నిర్వహించారు. అయితే.. ఇది కులదేవతను పూజిస్తూ.. గిరిజన సంప్రదాయంలో సాగే హోమంగా చెబుతున్నారు.
హోమం విషయంలో విమర్శలు రావడంతో డీహెచ్ స్పందించారు. గిరిజన ప్రాంతంలో ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొన్నానని తెలిపారు. స్థానికుల ఆహ్వానంతోనే వెళ్లానన్న ఆయన.. స్వయం ప్రకటిత దేవతతో సంబంధం లేదన్నారు. అమ్మవారి హోమ పూజలో స్థానికులతో కలిసి పాల్గొన్నానని తెలిపారు. తాను అసలు.. మూఢ నమ్మకాలను విశ్వసించనని స్పష్టం చేశారు.
ఎవరూ తప్పుడు అర్థాలు తప్పుదోవ పట్టిచ్చొద్దని కోరారు డీహెచ్. అవి క్షుద్రపూజలు కాదు.. వ్యక్తి పూజలు కాదు.. ముమ్మాటికీ అమ్మవారిని పూజిస్తూ స్థానికులు నిర్వహించిన హోమమని వివరణ ఇచ్చారు. తన ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సామాజిక సేవలు అందిస్తుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాను సైన్స్ ను నమ్మే వ్యక్తినని చెప్పారు శ్రీనివాసరావు.