తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎంసెట్ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ఖరారు చేస్తామని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. జూలై 14, 15 తేదీల్లో జరిగే ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా వేస్తున్నామని ప్రకటించారు.
అయితే.. జూలై 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ మాత్రం యథావిధంగా జరుగుతున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
ఇప్పటికే 3 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి మొదలైన ఈ సెలవులు నేటితో ముగియనున్నాయి. రేపు తిరిగి పాఠశాలలన్నీ తెరచుకోనున్నాయి. అయితే 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఇంకా తెరిపి ఇవ్వలేదు. మరో నాలుగైదు రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.