తెలంగాణలో ఎంసెట్ ఫలితాల ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. రేపు ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విషయాన్ని ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి, జేఎన్టీయూ-హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి విడుదల చేయనున్నారు.
జేఎన్టీయూ హైదరాబాద్ లోని గోల్డెన్ జూబ్లీహాల్లో ఈ ఫలితాలను విడుదల చేస్తారని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. మే 10,11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్, మే 12 నుంచి 15 వరకు ఆరు బ్యాచ్‌లుగా ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించారు.
ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్టు అధికారులు తెలిపారు. అదే విధంగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు లక్ష మందికి పైగా విద్యార్థులు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవల పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల చేశారు. అనంతరం అభ్యంతరాలు కూడా స్వీకరించారు.
తాజాగా ఇప్పుడు ఫలితాల విడుదలకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. ఎంసెట్‌లో అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫలితాల ర్యాంకులు, మార్కులను రేపు విడుదల చేస్తారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ తో ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాలను విద్యార్థులు eamcet.tsche.ac.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.