తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి విద్యాసంస్థలు ఓపెన్ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఈమేరకు ప్రకటన చేయగా… అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. విద్యాసంస్థలు, గురుకులాలు, వసతిగృహాలు తెరవడంపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్ హాజరయ్యారు.
తొమ్మిదో తరగతి నుండి పై తరగతుల విద్యాసంస్థలన్నీ ప్రారంభిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈనెల 25 వరకు పాఠశాలలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే, విద్యార్థుల హాజరుశాతం తప్పనిసరికాదని, మధ్యాహ్న భోజనం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకునేలా మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. పుస్తకాలు, యూనిఫారాలు ఇప్పటికే పాఠశాలలకు చేర్చామన్నారు. మంగళవారం మరోసారి అధికారులు సమావేశం కానుండగా, ఈ సమావేశానికి తల్లిదండ్రుల కమిటీని ఆహ్వానించామని మంత్రి తెలిపారు.