కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియలో స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేసింది తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్. 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. బీఆర్కే భవన్ దగ్గర ఆందోళనకు ప్రయత్నించారు సభ్యులు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఆర్కే భవన్ వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఉద్యోగుల విభజనలో స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ కుమార్. రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా సీనియారిటీ ప్రాతిపదికన కేటాయింపులు చేస్తుండడంతో చాలామందికి అన్యాయం జరుగుతోందని చెప్పారు. దీనిపై ఉద్యమం చేస్తామన్నారు. ఇక అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పురుషోత్తం మాట్లాడుతూ.. ఉద్యోగుల విభజన, కేటాయింపుల ప్రక్రియను వెబ్ సైట్ లో పెట్టాలని.. పారదర్శకత పాటించకపోతే ప్రభుత్వానికి చిక్కులు తప్పవని హెచ్చరించారు.