ఎవరి ఉద్యమ పునాదుల మీద రాజకీయంగా ఉద్యమాన్ని ప్రారంభించారో… ఎవరి పోరాట ఫలితాలతో అధికారాన్ని చేజిక్కించుకున్నారో, కలిసి నడుద్దాం అంటూ ఉద్యోగులతో… అలయ్ బలయ్ తీసుకుని ఎన్నికలకు వెళ్లారో… ఆ ఉద్యోగులు ఇప్పుడు ఎటువైపున్నారు…? ఎందుకింత మార్పు…? ఉద్యోగ సంఘాల నాయకులు.. ఉద్యోగులతోనే ఉన్నారా…?
తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోసింది ఉద్యోగులు. 14ఎఫ్ తో కదనానికి కాలు దూసింది ఉద్యోగులు. నాటి నుండి ఉద్యమ ఆకాంక్షను ముద్దాడే వరకు ఉద్యోగులు ఉమ్మడిగా కేసీఆర్‌కు అండగా నిలబడ్డారు. టీఆర్ఎస్‌కు ఎ కష్టం వచ్చినా, ఎన్ని ఉప ఎన్నికలు వచ్చినా… ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి… గెలిపించారు. కేసీఆర్ ఆప్ ఆగే బడో హామ్ తుమారే సాత్ హై అంటూ… కేసీఆర్‌కు బూస్ట్‌నిచ్చారు ఉద్యోగులు.
అలాంటి ఉద్యోగులు కేసీఆర్‌తో ఇప్పటికీ ఉన్నారా…? అసలు ప్రస్తుతం తెరమీద కనపడుతోన్న ఉద్యోగ సంఘాల నేతలను ఉద్యోగులు నమ్ముతున్నారా…? అంటే లేదనే చెప్పాలి. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకు బలం చేకూర్చుతూ… ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ చేసిన వాఖ్యలు తోడయ్యాయి. ఉద్యోగస్తులు ఎవరూ… టిఆర్ఎస్ కు అనుకూలంగా లేరు. అంతా దూరం అయ్యారు. కేవలం ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రమే మనతో ఉన్నారు అంటూ కామెంట్ చేశాడు. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మాది ఫ్రెండ్లి ప్రభుత్వం అని చెప్పుకునే టిఆర్ఎస్ కు ఉద్యోగస్తులకు దోస్తానా పూర్తిగా కట్ అయ్యింది.
కొందరు ఉద్యోగ సంఘాల నేతలకు పదవులు ఇస్తే సరిపోతుంది, వాళ్ళు చెప్పినట్లు ఉద్యోగులు వింటారు అనుకున్న గులాబీ నేతలకు కాస్త ఆలస్యంగా తత్వం బోధపడింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒక సారి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంటుంది కానీ 6 సంవత్సరాలు గడుస్తున్నా పీఆర్సీ ఇవ్వలేదు, పీఆర్సీ రాకపోయినా మధ్యంతర భృతి అయిన ఇస్తారు అని ఆశపడ్డ ఉద్యోగస్తులకు తీవ్ర నిరాశకు గురి చేశారు సీఎం. ఎన్నికల కంటే ముందే పీఆర్సీ ఇస్తారు అనుకున్నారు కానీ ఇవ్వలేదు, ఆ తరువాత కూడా పీఆర్సీ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండవ సారి అధికారంలోకి వచ్చాక సీఎం కొన్ని శాఖల ఉద్యోగులను లాంచగొండిలుగా చిత్రీకరించారు అన్న కోపం కూడా ఉద్యోగులకు ఉంది. అన్ని అధికారాలు ఉన్న వ్యక్తి ఒక శాఖలో అవినీతి ఎక్కువైంది అని బహిరంగంగ మాట్లాడడంతో ఆ శాఖ ఉద్యోగులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. తన అధికారాన్ని ఉపయోగించి లంచం తీసుకుంటున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి కానీ ఉద్యోగులందరిని టార్గెట్ చేయడం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా… అంటూ ఉద్యోగులు ఫైర్ అయ్యారు. ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసి తన చెప్పు చేతిలో పెట్టుకోవడానికి సీఎం వేసిన ఎత్తుగడగా కూడా కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసినా తమకు అనుకున్నంత న్యాయం జరగలేదు అన్నది ఉద్యోగుల వాదన. ఫిట్మెంట్ లేదు… పీఆర్సీ లేదు… కనీసం మధ్యంతర భృతి కూడా ఇవ్వడం లేదు… ఇంకా మేము ప్రభుత్వానికి ఎందుకు సహకరించాలి అంటున్నారు ఉద్యోగులు. ఉద్యోగ సంఘాల నేతలకు పదవులు వస్తే మాకేం వస్తది అని ప్రశ్నిస్తున్నారు .
ఉద్యమాలు మాకు కొత్త కాదు, మరోసారి మా హక్కులకోసం ఉద్యమ బాట పడుతాం అంటున్నారు ఉద్యోగులు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన ఉద్యోగులు మెల్లి మెల్లిగా ఆ పార్టీ కి దూరం అవుతున్నారు. పీఆర్సీ కానీ ఫిట్మెంట్ కానీ ఇవ్వకపోవడానికి ఖజానా ఖాళీ అవ్వడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నెల నెలా జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది అలాంటప్పుడు ఉద్యోగుల గొంతెమ్మ కొరికాలు ఎలా తీర్చాలి అని అంటున్నరు గులాబీ నేతలు. అందుకే ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో బృతిపై నిర్ణయం ఉంటుందని ముందుగా అనుకున్నా… అసలు ఆ విషయంపై చర్చే జరగలేదు. ఇప్పటికే ఆర్టీసి ఉద్యోగులు సమ్మెకు సిద్ధం అవుతున్నారు, ఇక మిగతా శాఖల ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగుల బాటలో వెళ్తారో లేక ప్రభుత్వ నిర్ణయం కోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తారో చూడాలి