డీఓపీటీ ఆదేశాలతో ఏపీకి వెళ్లారు తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్. గురువారం ఉదయం విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి కారులో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసేందుకు వెళ్లారు. సీఎస్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని అక్కడ జవహర్ రెడ్డిని కలిశారు.
ఏపీ సీఎస్ కు జాయినింగ్ రిపోర్ట్ చేసిన సోమేష్.. మరికాసేపట్లో సీఎం జగన్ తో భేటీ కానున్నారు. అయితే.. ఆయనకు ఏ పోస్ట్ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్ తో భేటీ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వీఆర్ఎస్ తీసుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి.
అంతకుముందు ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు సోమేష్. డీవోపీటీ ఆదేశాలను గౌరవిస్తూ ఏపీలో రిపోర్ట్ చేస్తున్నానని తెలిపారు. తనకు వీఆర్ఎస్ కు తొందర లేదన్నారు కుటుంబసభ్యులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
సోమేష్ సేవలను ముఖ్యమంత్రి జగన్ ఏ రకంగా ఉపయోగించుకోనున్నారనే అంశంపై ఆసక్తి ఏర్పడింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమేష్ కుమార్ ను అక్కడి విధుల నుంచి రిలీవ్ చేసింది. ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. దీంతో ఆయన రిపోర్ట్ చేసేందుకు విజయవాడ వచ్చారు.