మే 29వరకు లాక్ డౌన్ పొడిగించిన తెలంగాణ సర్కార్.. కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తామని, సడలింపులు ఉంటాయని ప్రకటించింది. రెడ్ జోన్ లో నిబంధనలు కఠినంగా అమలు చేస్తూనే… రాత్రి 7గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించారు. ఇక గర్భిణీలు, 65 సంవత్సరాల పై బడిన వారు, పిల్లలు బయటకు రావొద్దని సీఎం కేసీఆర్ కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల ప్రకారం ఏయే పనులు చేసుకోవచ్చు అంటే….
గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రం వరకు అన్నీ షాపులు తెరుచుకకుంటాయి. మున్సిపాలిటీల్లో 50శాతం షాపులు ఒకరోజు, మిగతా 50శాతం షాపులు మరొక రోజు తెరుచుకుంటాయి. ఈ నిబంధనలన్నీ గ్రీన్, ఆరెంజ్ జోన్లకే పరిమితం అవుతాయి. అయితే… గ్రీన్ జోన్లలో 50శాతం బస్సులు నడిపేందుకు కేంద్రం అనుమతించినప్పటికీ తెలంగాణలో మే 15వరకు బస్సులు నడవవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆరెంజ్ జోన్లలో క్యాబ్ లకు అనుమతి ఇచ్చారు.
రెడ్ జోన్ లో కేవలం భవన నిర్మాణ పనులు, వైన్ షాపులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కిరాణా, నిత్యావసర దుకాణాలతో పాటు సిమెంట్, స్టీల్, హార్డ్ వేర్, ఎలక్ట్రికల్ షాపులకు అనుమతి వచ్చింది. వ్యవసాయ పనులు జరుగుతాయి కాబట్టి.. వ్యవసాయ అనుబంధ షాపులకు కూడా మినహాయింపు ఇచ్చారు. ఇక ఆర్టీఏ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరుచుకోవటంతో పాటు ఇసుక, సిమెంట్ రవాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అయితే భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే… వెంటనే షాపుల అనుమతి రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.