టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనేక కోణాలున్నాయని, విదేశాల నుండి భారీగా డబ్బు చేతులు మారిందన్న ఆరోపణలుండటంతో కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఇప్పటి వరకు జరిగిన విచారణను ఎక్సైజ్ శాఖ కోర్టుకు అందించింది.
2017లో నమోదైన 12 డ్రగ్స్ కేసుల దర్యాప్తు పూర్తయిందని కోర్టుకు తెలిపిన ఎక్సైజ్ శాఖ, 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేశామని, మరో ఛార్జ్ షీట్ త్వరలో వేస్తామని తెలిపింది. డ్రగ్స్ కేసుల దర్యాప్తు చేసే అధికారం కేంద్ర సంస్థలతో పాటు తమకూ ఉందన్న ఎక్సైజ్ శాఖ, ఇప్పటికే దర్యాప్తు పూర్తయినందున కేంద్ర సంస్థలకు అప్పగించాల్సిన అవసరం లేదని వాదించింది.
ఈ కేసులో ఎక్సైజ్ శాఖ తమకు డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వడం లేదని ఈడీ హైకోర్టుకు తెలిపింది. ఛార్జ్ షీట్లు, వాంగ్మూలాలు ఈడీకి ఇచ్చేలా ఎక్సైజ్ ను ఆదేశించాలని సొలిసిటర్ జనరల్ కోరారు. ఇక ఎక్సైజ్ శాఖ నివేదికలో కనీస వివరాలు లేవన్న రేవంత్ రెడ్డి న్యాయవాది రచన రెడ్డి, ఎక్సైజ్ శాఖ నివేదికపై అభ్యంతరాలను సమర్పించేందుకు గడువు కోరారు. దీంతో కేసును రెండు వారాలు కోర్టు వాయిదా వేసింది.