వరుసగా పంట నష్టాలతో తీవ్ర నిరాశకు గురైన ఓ యువరైతు బైక్ ల దొంగగా మారాడు. నాగర్ కర్నూల్ జిల్లా రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 33 ఏళ్ల కొమిరె యాదగిరి వ్యవసాయంలో వరుసగా నష్టాలు రావడంతో ద్విచక్ర వాహనాలను దొంగిలించడం మొదలుపెట్టాడు. దొంగిలించిన వాహనాలకు నకిలీ పత్రాలు సృష్టించి తన ఊరిలోనే అమ్మేవాడు. వాటిని అమ్మివేయగా వచ్చిన డబ్బులను తిరిగి వ్యవసాయానికి వినియోగించేవాడు. హైదరాబాద్ లో చైతన్యపురి పోలీసులు నాగోల్ చౌరస్తా దగ్గర వాహనాలను తనిఖీ చేస్తుండగా యాదగిరి పట్టుబడ్డాడు. అతన్ని స్టేషన్ కు తీసుకెళ్లి విచారించగా వివరాలు వెల్లడించాడు. యాదగిరి నుంచి 5 లక్షల విలువ గల 10 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ ప్లేసెస్ లో పార్క్ చేసిన వాహనాలను దొంగించేవాడు.యాదగిరిపై పలు సెక్షన్ల కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.