హైదరాబాద్ : భూమి కోసం…! భుక్తి కోసం..! విముక్తి కోసం…!! ఇది గతంలో తెలంగాణలో పోరు వీరుల నినాదం. తరం మారింది. పొరుబాటకు ప్రతి ఫలంగా ప్రత్యేక తెలంగాణా వచ్చింది. కానీ బక్క రైతుల బాధలు తొలగాయా..? రెవెన్యూ మోసాలు పోయాయా…? లేనేలేదు.
తెలంగాణాలో ఇదే నేటి నిజం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఏరియాలో బక్క రైతుల భూమి మరొకరి పేరుతో మారింది. అలా ఎందుకు జరిగిందో లోగుట్టు రెవెన్యూ పెరుమాళ్ళ కెరుక…!? పాపం ఆ రైతులు రెవెన్యూ అధికారుల కాళ్లపై పడి రోదించారు. మేము బత్కలేమని రెవెన్యూ కార్యాలయం దగ్గర అధికారుల కాళ్ళు పట్టుకుని మరీ కనికరించమని వేడుకున్నారు. మాకు న్యాయం చేయాలని మొత్తుకున్నారు.
అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ? సీఎం కేసీఆర్‌కు రెవెన్యూశాఖపై కంట్రోల్ లేదా…? అవినీతి పరులున్నారని సాక్షాత్తు చెబుతున్న సీఎం ఎందుకు చర్యలు తీసు కోలేకపోతున్నారు.? ఇది ఒక చిక్కు ప్రశ్న.
భూ రికార్డుల ప్రక్షాళనకు రాత్రింబవళ్లూ పనిచేసిన తమకు బోనస్ ఇచ్చిన సర్కార్ ఇప్పుడు అవినీతిపరులని ముద్ర వేస్తే ఎలా..? ఇదీ ఓపక్క వీఆర్వోల సంఘం ప్రశ్న. తెలంగాణలో జరిగే ఏసీబీ దాడుల్లో రెవెన్యూ వాళ్ళే పట్టుబడుతున్నారు. తహశీల్దార్ల తీరుపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. భూ రికార్డులు తారుమారు అవుతూనే ఉన్నాయి. పేద రైతుల కష్టాలు షరా మామూలే… ! ఈ భూమి మాదిరా..! ఈ చెల్క మాదిరా..! రెవెన్యూ వాడేందిరో … ! ఈ రికార్డులు మార్చుడేందిరో..! అని మరో పోరాటం చేసే కాలం దాపురించింది…!
https://twitter.com/PTelangana/status/1168110340040790016?s=20