ప్రకృతి విపత్తులతో ప్రతిసారి రాష్ట్రం నిండా మునిగిపోతున్నా..కేసీఆర్ సర్కార్కు చోద్యం చూడటం అలవాటైపోయింది.భారీ వర్షాలకు ఏటా లక్షలాది ఎకరాల్లో పంట మునిగిపోతున్నా..చీమకుట్టినట్టు కూడా ఉండటం లేదు.నష్టంపై సర్వే చేసి,అంచనాలను రూపొందించి కేంద్రాన్ని సాయం కోరాలన్న సోయి కూడా లేకుండాపోతోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణవ్యాప్తంగా భారీ ఎత్తున పంట నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ నష్టం వేల కోట్లలోఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణా జిల్లాలలో రికార్డు వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు ఖమ్మం జిల్లాల్లోనూ భారీగా పంట నష్టం జరిగినట్టు నివేదికలు అందాయి.
వరి,పత్తి కలిపి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి ఉండొచ్చని అంచనా.కానీ పేపర్లలో తప్ప..క్షేత్రస్థాయిలో ఈ నష్టంపై అంచనా వేసే ఆలోచనే లేకుండాపోయింది ప్రభుత్వానికి. ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయినప్పుడు.. సర్వే నెంబర్ల వారీగా నివేదికలు రూపొందించి.. కేంద్రానికి నివేదిక పంపితే ఎంతో కొంత సాయం అవకాశముంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడమే మానేసింది. గత రబీ సమయంలో లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినా పట్టించుకోలేదు ప్రభుత్వం. తాజాగా మళ్లీ అదే పరిస్థితి నెలకొన్నా..చేష్టలుడిగి చూస్తోంది.